దొంగనోట్ల ముఠా కోసం వేట !
భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం క్రితం వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పెద్దినేని రవిప్రసాద్, పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడు పవన్ కుమార్ రెడ్డి పట్టుబడ్డారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు బయట పడగా, వీటిని ముద్రించటం వారి ఇద్దరి వల్లనే సాధ్యమైందా ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విలీనమైన మండలాల్లో ఇటీవల దొంగనోట్లు వెలుగులోకి వచ్చాయి.
భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో ఇప్పటికే పెద్ద మొత్తంలోనే దొంగనోట్ల మార్పిడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో దీని వెనుక మరికొంతమంది పాత్ర ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా, భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ మళ్లీ ఊపందుకోవటంపై జిల్లా పోలీసుశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ యువ ఎస్సై దొంగనోట్ల కేసు వ్యవహారంలో తలదూర్చి ఏకంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా దొంగనోట్లు దొరికితే, అది భద్రాచలంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లుగా బయట పడుతుండటం జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆలోచనలో పడేసింది. భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ, నల్లబెల్లం విక్రయాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల అమ్మకాలు వంటివి అడపా దడపా బయట పడుతుండటంతో దీని వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించారుు.
ఎందుకిలా జరుగుతోంది
భద్రాచలం పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలపాలకు అడ్డుక ట్ట వేసేందుకు పోలీసులు నడుం బిగించారు. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరన్ ప్రెండ్లీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా దివస్‌ను కూడా నిర్వహిస్తూ, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా భద్రాచలం పట్టణంలో దొంగనోట్ల ముద్రణ వ్యవహారమే పోలీసుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. చిన్నపాటి పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సరిపడా పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. పట్టణ పోలీసు స్టేషన్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. వీరితో పాటు నిఘా వర్గాలు సైతం పనిచేస్తున్నాయి. అరుునప్పటికీ అసాంఘిక చర్యలు వెలుగులోకి రావడం వారిని కలవరపాటుకు గురిచేస్తున్నారుు.
నిఘా పటిష్టం చేయాల్సిందే
భద్రాచలం పట్టణంలోని శివారు కాలనీల్లో కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. నాలుగు రాష్ట్రాల కూడలిగా ఉన్న భద్రాచలంలో వివిధ వ్యాపారాల నిర్వహణ కోసమని ఇక్కడికి అనేకమంది వస్తుంటారు. పట్టణానికి అనుకొని ఉన్న ప్రాంతం అంతా ప్రస్తుతం ఏపీలో విలీనం అయింది. నెల్లిపాక మండల కేంద్రంగా ఏపీ పోలీసులు పాలన సాగిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంపై అవగాహన పూర్తి స్థాయిలో లేకపోవటం కొంత ఇబ్బంది కలిగించే అంశమని పట్టణవాసులు అంటున్నారు. భద్రాచలం పోలీసులు వారితో సమన్వయం చేసుకొని శివారు కాలనీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.