దోపిడీ దొంగల అరెస్ట్
మహబూబ్‌నగర్,నవంబర్7(జనంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల నగదును అపహరించారు. ఈకేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగులను పట్టుకున్నారు. హైదరాబాద్ రామకోటీలో సైకిళ్ల వ్యాపారం చేసే రాంఅవతార్ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లి తిరుగు ప్రయాణంలో జడ్చర్ల ఇన్‌స్పెక్షన్ బంగ్లా వద్ద సేద తీరే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 5 మంది దుండగులు రాం అవతార్‌ను పిస్తోలుతో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.3.84 లక్షలు నగదుతో పాటు షిప్ట్ కారు, సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. దీంతో బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు జిల్లా ఎస్‌పీ అనురాధ ఆదేశానుసారం నిందితుల కోసం గాలింపులు ముమ్మరం చేశారు. బాలానగర్, రాజాపూర్, తిమ్మాజిపేట, మిడ్జిల్ మండల పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేయగా, సిప్ట్ కారుతో ఉడాయించిన దుండగులు మిడ్జిల్ పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌పీ హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి చేరారు. దారి దోపిడీకి సంబంధించి జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ తెలిపారు. పట్టుబడిన దుండగులను జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి విూడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.