దోమలతో విషజ్వరాలు

రిమ్స్‌కు పెరుగుతున్న రోగులు
శ్రీకాకుళం,పిబ్రవరి20(జ‌నంసాక్షి): దోమల కారణంగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు
పెరుగుతోంది. దోమల బారిన పడి అస్వస్థతకు గురైన వారు పెద్ద సంఖ్యలో శ్రీకాకుళం రిమ్స్‌ని
ఆశ్రయిస్తుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో జిల్లాలో దోమల సంఖ్య బాగా వృద్ధి చెంది.. వాటి బారిన పడి ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లాలో రోజురోజుకు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా దోమలు స్వైరవిహారం కారణంగా శ్రీకాకుళం రిమ్స్‌  ఆసుపత్రికి జ్వరాలతో బాధపడుతూ వస్తున్న వారి సంఖ్యరోజురోజుకు పెరుగుతోంది. దోమకాటు వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగీ తదితర జ్వరాలు వస్తున్నాయి. రిమ్స్‌లో నెలకు 300 మందికి పైగా జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది.దోమల నివారణకు సాధారణ, ఆర్థిక సంఘం నిధులు  ఖర్చయిపోతున్నాయి తప్ప దోమల నివారణ కానరావడం లేదు.  పెద్ద మొత్తంలో వెచ్చించినా దోమల సంతతి నానాటికి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది.  జిల్లాలోని పంచాయతీలు, పురపాలక సంఘాల్లో దోమల నివారణకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవటం లేదు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల సమయంలో కొంత హడావిడి చేసి.. ఆ తరువాత చిత్తశుద్ధి కనబర్చడం లేదు. పట్టణాలు, గ్రామాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం, ఉన్న కాలువలు సైతం మరమ్మతులకు గురికావటం, ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం, ప్రజలు కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం.. తదితర కారణాలతో దోమలు పెరిగిపోతున్నాయి.  దోమల నివారణకు దోహదపడే మెలాథియన్‌ ఆయిల్‌ బాల్స్‌, వాడేసిన ఇంజిన్‌ ఆయిల్‌ వేయాల్సి ఉంటుంది. మరుగుదొడ్ల ట్యాంకుల గొట్టాలకు వలలు కట్టడం, కాలువల్లో దోమల లార్వాలు చనిపోయేందుకు బైటాక్స్‌, నువాను తదితర రసాయనాలు వెదజల్లాల్సి ఉంటుంది. పెద్ద దోమలు చనిపోయేందుకు ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. నీరు నిల్వ ఉండే చోట లార్వాలు పెరిగే అవకాశం ఉంది. పనులు చేపట్టాల్సిన పంచాయతీలు, పురపాలక సంఘాలు మొక్కుబడి పనులతో సరిపెడుతున్నాయి. దోమల నివారణకు స్థానిక సంస్థలకు సాధారణ ఖాతా నిధులు, ఆర్థిక సంఘాల నిధులు ఖర్చు చేసే వెలుసుబాటు కల్పించినా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి తప్ప.. దోమలు నిర్మూలన కావటం లేదు. దోమల నివారణకు నగరపాలక సంస్థ ప్రజారోగ్యం విభాగం అధికారులు ఆరుగురు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. ఒక్కొక్కరికి ఎనిమిది డివిజన్ల చొప్పున అప్పగించారు. ఈ పనుల కోసం ఆరు స్పేయ్రర్లు, మూడు ఫాగింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.