దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా!
ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమయం అయిపోయాయని, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది. మాజీ, సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించడంతోపాటు, దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం నిన్న దీనిని విచారించింది.

ఒకసారి దోషిగా తేలిన తర్వాత, దానిని హైకోర్టు నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ నాయకులు పార్లమెంటుకు, శాసనసభకు ఎలా వస్తున్నారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎవరైనా నాయకుడు దోషిగా తేలితే ఆరేళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8, 9 నిబంధనలపై సందేహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసులో దోషిగా తేలితే సర్వీసులో కొనసాగేందుకు అర్హత కోల్పోతాడని, కానీ అతడు మంత్రి కావొచ్చని వ్యాఖ్యానించింది. హత్యలు చేసిన నేతలు పార్టీలు నడపడంపై ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది.

42 శాతం మంది సిటింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడింగ్‌లో ఉన్నాయని, కొన్ని కేసులు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని విజయ్ హన్సారియా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ అంశం పరిశీలన కోసం తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ప్రతిపాదిస్తామని తెలిపారు. కాగా, హత్య చేసిన వారు కూడా గుర్తింపు పొందిన పార్టీలకు అధ్యక్షులుగా ఉండేందుకు ప్రస్తుత చట్టం అవకాశం కల్పిస్తోందని, దానిని పరిశీలించాలని విజయ్ కోరారు.

ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల చెల్లుబాటుపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున హాజరైన న్యాయవాది సిద్ధాంత్‌‌కుమార్ మాట్లాడుతూ తమ అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 4కు వాయిదా వేసింది.