ద్వారకా తిరుమలలో భక్తుల ఇక్కట్లు

ఏలూరు,మే26(జ‌నంసాక్షి): చిన్నవెంకన్న ఆలయం యాత్రికులతో కిక్కిరిసింది. విద్యార్థులకు సెలవులతో పాటు వేసవి సెలవులు కావడంతో యాత్రికులు తరలివస్తున్నారు. స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయ పరిసరాలు, శేషాచల కొండ ప్రాంతం యాత్రికులతో కిక్కిరిసింది. దేవస్థానం అధికారులు చేపట్టిన తాత్కలిక వసతులు యాత్రికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా కేశఖండన శాల , దర్శన క్యూలైన్ల వద్ద యాత్రికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. నిలువ నీడలేక సూర్యుడి ప్రతాపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య యాత్రికులు గంటలతరబడి క్యూలో నిరీక్షించి దర్శనాన్ని చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి శని, ఆదివారాల్లో రద్దీ అధికంగా ఉంటుందని అధికారులకు తెలిసిన వసతులు కల్పించడంలో విఫలం అయ్యారు. వేల మంది స్వామి దర్శనానికి యాత్రికులు వస్తారని అంచనాలు ఉన్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయలేకపోయారు. శీతకాలం, వర్షకాలం సమయంలో వాతావరణంలో కొంత మార్పులు జరుగుతాయి కానీ వేసవిలో మాత్రం సూర్యప్రతాపం అధికంగా ఉండడంతో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.