ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
సంగారెడ్డి,మే7(జనంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో రైతు తక్కువ ధరకు పంటలు అమ్ముకుని మోసపోతున్నాడు. ఇది గమనించిన ప్రభుత్వం ఇంకా కోతలు ఉద్ధృతం కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో తొలి వరి కొనుగోలు కేంద్రాన్ని పుల్కల్ మండలం కోడూరులో ప్రారంభించారు. అలాగే ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి మండలంలోనూ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. రైతు పండించిన పంటను వెంటనే అమ్ముకోవాల నుకుంటాడు. అందుకు అందుబాటులో ఎవరుంటే వారికి విక్రయిస్తాడు. వరి కోతలు ముమ్మరం కాకముందే కేంద్రాలు ప్రారంభించడం వల్ల రైతుల చేతికి పంట వచ్చిన వెంటనే విక్రయిస్తారనే ఆలోచనతోనే ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. గతంలో సహకార సంఘాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు వేయి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న గిటుబాటు ధరప్రభుత్వ కేంద్రాలతోనే సాధ్యం. ప్రైవేటు వ్యాపారులు అంత ధర చెల్లించరు. ఒకవేళ చెల్లించినా క్వింటాల్‌కు పది
కిలోల వరకు తూకంలో మోసం చేస్తారు. ఇది రైతులు గమనించాలి. వారైతే డబ్బులు ఎగొట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కేంద్రాల్లో ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. డబ్బులకు హావిూ ఉంటుంది. రైతుల కోరిక మేరకు మరిన్ని వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.