ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. అలాగే తెచ్చిన ధాన్యాన్ని కొన్న తరవాత రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం ఖాతాలు తెరిపించాలని కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో , ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ భారతి  ళికెరి తెలిపారు. అలాగే మొక్కజొన్నల కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ఆ ధర పొందాలని సూచించారు.రైతులు మార్గదర్శకాల ప్రకారం 17 శాతంలోపు తేమ ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోనే డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న రైతులు తమ ఖాతా నెంబర్లు అందజేయాలని, ఖాతాలు లేనివారు తెరవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్లు జారీ చేయాలని తెలిపారు. రైతులను దళారుల నుంచి కాపాడేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మార్కెంటిగ్‌ అధికారులు వెల్లడించారు. పాత జిల్లాలో కంటే కొత్త జిల్లాలో రెట్టింపు సంఖ్యలో కేంద్రాలను ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారని తెలిపారు. ఎక్కడైనా రైతులను వేధించినా, మోసం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

—-