ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

మెదక్‌,మే5(జ‌నం సాక్షి):ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటులో అక్కడక్కడ జాప్యం రైతన్నను ఆగం చేస్తోంది. అన్నీ ఒక్కరోజే ఆరంభిస్తామన్న అధికారుల మాటలకు చేతలకు పొంతనలేని తీరు కనిపిస్తోంది. ఇక ఏర్పాటు చేసిన వాటిలో సమస్యలు వెన్నాడుతున్నాయి. దీంతో మెదక్‌ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ, సహకార శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.  ఇటీవలే జిల్లాస్థాయి అధికారుల సవిూక్షలో  మొత్తం కేంద్రాలను ప్రారంభించాల్సి ఉన్నా అడుగు పడడం లేదు. ప్రారంభమైన పలు చోట్లా ధాన్యం కొనుగోళ్లు మొదలు కావాల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం ఇప్పటికే జిల్లాలో అన్ని కేంద్రాలు ప్రారంభమవ్వాల్సి ఉంది. సీజన్‌ ఆరంభం నాటికే అన్ని వసతులు సమకూరితే రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశముంది. ఆలస్యంగా ప్రారంభమవడం వల్ల అక్కడక్కడ
ఇప్పటికే సమస్యలు ఉత్పన్నమవుతున్నారు. దీనికితోడు అవసరమైన గన్నీ సంచులు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు రావడంలో ఆలస్యం జరిగింది. చాలావరకు గ్రామాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో రైతులు కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. కొనుగోలు ప్రారంభమైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా ధాన్యం సిద్ధంగా ఉన్న గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.