ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. దళారులను ఆశ్రయించకుండా, కేంద్రాలను వినియోగించుకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను అందుకోవాలని రైతులకు సూచించారు. నిబంధనల ప్రకారం వరి ధాన్యం తేమ శాతం 15, మొక్కజొన్నలు 14 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవాలని, కేంద్రాల నిర్వాహకులతో రైతులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు అనువైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 40 వరకు సహకార సంఘాలు, 40పైగా ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రాల నుంచి ధాన్యం తరలించిన తర్వాత 48 గంటల్లోగా సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేంద్రాల ద్వారా మొక్కజొన్నలు సైతం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లుల్లో దించుకుని వారికి అండగా నిలవాలని జేసీ మిల్లర్లను కోరారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో సిద్దిపేటలో రైస్‌మిల్లర్లతో ఇటీవల ఆయన చర్చించారు.మిల్లర్లుల పౌరసరఫరాల సంస్థకు లక్ష గన్నీ బస్తాలు వెంటనే ఇవ్వాలన్నారు. వర్షాలకు తడిసిన మొక్కజొన్నలు, మొలకలు వచ్చినవి, రంగు మారినవి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.