ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు
సిద్దిపేట,నవంబర్1(జనంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు సంక్షమమే ప్రభుత్వ ధ్యేయమనీ తెలిపారు. ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రైతులు నేరుగా అమ్మక కేంద్రాలకే ధాన్యం తీసుకుని రావాలని అన్నారు. దళారుల మాటలునమ్మి మోసపోతే దానికి ప్రబుత్వం బాధ్యత వహించదన్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు పక్కాగా చేపట్టామని అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో చెల్లింపులు జరిపేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొనుగోళ్ల నమోదుకు అనుగుణంగా 48 గంటల్లో చెల్లింపులు జరుపుతామన్నారు. ముఖ్యంగా రైతులు ధాన్యంలో తాలు లేకుండా శుభ్రపరచి కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని కోరారు. కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైసు మిల్లులకు తరలిస్తామన్నారు.నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు చేరుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర అధికారులకు సమాచారం అందుతుందన్నారు.