నకిలీ విత్తనాలు అన్నదాతకు కష్టాలు

పుట్టుకొస్తున్న నకిలీ బ్రాండ్‌లు
సిండికేట్‌గా మారిన అక్రమార్కులు
అధికారుల ఉత్తుత్తి తనిఖీలు..
నకిలీ బ్రాండ్‌, కంపెనీలను అరికట్టడంలో విఫలం
స్టాక్‌ రిజిస్టర్లపైనే అధికారుల దృష్టి
ఏటేటా నష్టపోతున్న రైతన్నలు
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్న డిఏవో
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూన్ ‌16 : వర్షాకాలం ఆరంభం కావడంతో వానాకాలం వ్యవసాయ పనులు ఆరంభమయ్యాయి. ఇదే అదనుగా అన్నదాతలను ఆగం చేసేందుకు డూప్లికేటుగాళ్ళు రెడీ అవుతున్నారు. ఏటా నకిలీ, నాణ్యతలేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ బ్రాండులు, కంపెనీలు, మొలకెత్తే శాతం తక్కువ ఉన్న విత్తనాలను విక్రయిస్తూ రైతులను దెబ్బతీస్తున్నారు. విత్తన మార్కెట్లో అక్రమార్కులు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నా వారిని గుర్తించడంలో వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు విఫలమతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించడం, డిమాండ్‌ ఉన్న సీడ్స్‌ను సిండికేట్‌గా మారి బ్లాక్‌లో విక్రయించడం, కంపెనీల అడ్రస్‌లేని విత్తనాలు విక్రయించడం, కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి రోజువారిగా తీసుకువచ్చి నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తున్నా అధికారుల దృష్టికి మాత్రం రావడం లేదు. అయితే ఇలాంటి విషయాలపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార యంత్రాంగం చెబుతోంది.
సిండికేట్‌… బ్లాక్‌ దందా…
జోగులాంబ గద్వాల‌ జిల్లాలో విత్తన విక్రయదారులు సిండికేట్‌గా మారి బ్లాక్‌ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ దిగుబడి వస్తాయని రైతులు నమ్ముతున్న విత్తనాలను బ్లాక్‌ చేసి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. రైతులు అడుగుతున్న విత్తనాల ప్యాకెట్లు కావాలంటే వారి వద్ద ఉన్న మరో రకం విత్తనాలను  కొనాలని ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో వారు చెప్పిన విత్తన ప్యాకెట్లు కొనక తప్పడం లేదని చెబుతున్నారు.
ఫేక్‌ కంపెనీ అడ్రస్‌లు… 
మొలకెత్తే శాతం ముద్రించని విత్తనాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కొంత మంది విక్రయదారులు దుకాణాల్లో నిబంధనలు పాటిస్తూ బయట మాత్రం నకిలీ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రంలోని కృష్ణా,గుంటూరు తదితర జిల్లాల నుంచి రోజు వారీగా విత్తనాలు కొనుగోలు చేసి గద్వాల ‌, శాంతినగర్ ,అయిజ  తదితర ప్రాంతాల్లో అక్రమార్కులు విచ్ఛల విడిగా అమ్ముతున్నారు.
అక్రమ దందాలను గుర్తించడంలో విఫలం
ఎప్పటికప్పుడూ తనిఖీలు, ఆకస్మిక దాడులు చేస్తున్న అధికార యంత్రాంగ సీడ్స్‌ దుకాణాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా? స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లులు తదితర వివరాల సక్రమంగా ఉన్నాయా అనే విషయాలపైనే దృష్టి పెడుతున్నారు. అయితే వ్యాపారులు ఇతరత్ర మార్గాల్లో చేస్తున్న దందాను గుర్తించలేకపోతున్నారు. గత నెల జిల్లాలోని పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసిన అధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే అనుమానంతో వాటిని పరీక్ష కోసం హైదరాబాద్‌కు పంపించారు. అయితే వాటి నిర్ధారణ ఇంకా జరుగలేదు. ఇక జిల్లాలోని మరో వేరు వేరు దుకాణలలో గడువు తీరిన విత్తనాలు పట్టుబడడంతో సదరు అరుగురు వ్యక్తులపై  కేసు నమోదు చేశామని వయవసాయ అధికారి తెలిపారు.
మోసపోతూ… నష్టపోతున్న రైతులు…
ప్రతీ సంవత్సరం అక్రమ వ్యాపారుల చేతుల్లో మోసపోతూ… రైతులు నష్టపోతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు వారికి  నాణ్యత లేని, ఫేక్‌ కంపెనీల విత్తనాలు అంటగడుతూనే ఉన్నారు. దీంతో విత్తిన తర్వాత మొలకెత్తకపోవడం, ఏపుగా పెరిగిన పంట కాత లేకపోవడం వంటి కారణాలతో పాటు గింజలు లేని వరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫిర్యాదుల వస్తే చర్యలు తీసుకుంటాం :  
గోవింద్ నాయక్ , జిల్లా వ్యవసాయ శాఖాధికారి
నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాం. దీంతో నకలీ విత్తనాలు అమ్మకం జరగడం లేదు. బ్లాక్‌ దందా, ఫేక్‌ కంపెనీల విత్తనాలు విక్రయించడం లాంటి వాటిపై ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశాం. మాతో పాటు టాస్క్‌ఫోర్సు, పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైతులను మోసం చేస్తూ వ్యాపారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.