నకిలీ శనగ పిండి
పహాడీషరీఫ్,డిసెంబర్16(జనంసాక్షి): కల్తీ శనగపప్పు తయారు చేసి రాందేవ్ బాబా ఫుడ్ ప్రోడక్ట్స్ పేరుతో విక్రయిస్తున్న ఓ మిల్లుపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం దాడులు చేసి పెద్ద ఎత్తున శనగపిండితో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సరుకుతో పాటు నిందితులను పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీలో సూరజ్ మాల్ అనే వ్యక్తి ఇతర పప్పులతో శనగపప్పు తయారు చేస్తూ రాందేవ్ బాబా ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో విక్రయిస్తున్నాడు. కొద్ది పాటి శనగలు, బఠానీలు, మొక్క జొన్న వ్యర్థాలు, మూంగుదాల్ తదితర వాటితో శనగపప్పును తయారు చేస్తున్నాడు. అలా చేసిన శనగపప్పును శుద్దమైన బాబా రాందేవ్ బాబా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్యాకెట్లలో నింపి ఎంచక్కా బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం మిల్లుపై దాడులు నిర్వహించారు. మిల్లులో నిల్వ ఉన్న 35 కిలోల 74 సంచులు, 50 కిలోల 25 సంచులు, 10 కిలోల 100 సంచుల శనగపప్పును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 176 సంచుల శనగపప్పు, 62 సంచుల బఠానీ పప్పు, 54 సంచుల పెసర పప్పు, 96 సంచుల మొక్కజొన్న వ్యర్థాలు, రాందేవ్ బాబా ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ముద్రించిన తొమ్మిది వేల ఖాలీ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు సూరజ్‌తో పాటు సూపర్‌వైజర్ ఎం.దుర్గయ్య, డ్రై వర్ చౌహాన్ రాహుల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.