నగరాలకు చేరుకున్న టీకా..

 

 

 

– అదనంగా వ్యాక్సిన్‌లు నిల్వఉంచుకోవాలి: సీఎస్‌

హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కరోనా టీకా కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలోని శీతలీకరణ కేంద్రానికి చేరింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్‌ విూటర్ల వ్యాక్సిన్‌ కూలర్‌లో టీకాలను నిల్వ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్‌ టీకా వేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత కొవిడ్‌ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏండ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి వ్యాక్సిన్‌ను ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను శంషాబాద్‌ విమానశ్రయానికి తరలించారు. 3.72 లక్షల డోసుల కొవిడ్‌ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి.

అదనంగా టీకాలు ఉంచుకోవాలి: సీఎస్‌

హైదరాబాద్‌: తొలి దశలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యాక్సిన్‌ సన్నద్ధతపై దృశ్యమాధ్యమ సవిూక్ష నిర్వహించారు. ఎవరికైనా టీకా వికటిస్తే సత్వరమే చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచుకోవాలని.. అలాగే ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారందరూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కీలకమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలన్నారు. మొదటి రోజు తక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి తద్వారా ఎదురయ్యే అనుభవాల ఆధారంగా క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని కలెక్టర్లకు సీఎస్‌ సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌కు 4.75లక్షల డోసులు

తొలిదశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా డోసులు పుణె నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రత్యేక బందోబస్తుతో గవర్నరంలోని రాష్ట్ర వ్యాధినిరోధక భవనానికి తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిదశలో భాగంగా 4.75 లక్షల మందికి కొవిషీల్డ్‌ టీకా అందించనున్నారు. మొదటి విడత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేయనున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇందుకు సరిపడా వ్యాక్సిన్‌ రానున్నాయని, ఇక్కడి నుంచే మిగతా జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపనున్నట్టు చెప్పారు. గన్నవరం వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో జిల్లాకు సరిపడా టీకాలను భద్రపరచనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.