నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌
ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో ఉంటారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ ఇస్తారని ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇదే స్థానాన్ని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా అధినేతల ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.గత ఎన్నికల్లో తొమ్మిది చోట్ల గులాబీ జెండా ఎగరడంతో అదే ఉత్సాహంతో లోకసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి తెరాస తమ ప్రయత్నాలకు మరింతగా పదును పెట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్‌ మినహా తొమ్మిది స్థానాల్లో తెరాస జెండా ఎగురవేయగా.. ఒక స్థానానికే కాంగ్రెస్‌ పరిమితమైంది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి గోడం నగేశ్‌, పెద్దపల్లి నుంచి బాల్క సుమన్‌లు విజయం సాధించారు. రాబోయే లోకసభ ఎన్నికలకు గోడం నగేశ్‌ మరో సారి పోటీచేయడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేయగా.. బాల్క సుమన్‌ మాత్రం చెన్నూరు అసెంబ్లీ నుంచి బరిలోనిల్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ స్థానం నుంచి తెరాస తరఫున తీవ్రపోటీ నెలకొంది. అదే స్థాయిలో భాజపా కూడా తమ పార్టీ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉండటతో భాజపా తరఫున పోటీ దారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన మడావి రాజు, సట్ల అశోక్‌లతో పాటు మాజీ మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్‌, ఆడె మానాజీ, శ్రీరాంనాయక్‌ల బరిలో నిలవడానికి టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.