నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
హైదరాబాద్,డిసెంబరు 31(జనంసాక్షి):ప్రముఖ సినీ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతుండగానే ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేవిూలు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, కొడుకు రుత్విక్ యాదవ్ ఉన్నారు. నటుడిగా నర్సింగ్ యాదవ్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మ బ్రేక్ ఇచ్చారు. వర్మ ప్రతీ మూవీలో నర్సింగ్ యాదవ్‌కు తప్పనిసరిగా ఓ క్యారెక్టర్ ఉండాల్సిందే. ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, మాస్టర్, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, సై, నువ్వొస్తానంటే నేనొదంటానా, ఇడియట్, గాయం, క్షణక్షణం, మాయలోడు, అల్లరి ప్రేమికుడు తదితర చిత్రాల్లో నటించారు.