నడి రోడ్డుపైనే సరుకు దిగుమతులు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 10 (జనం సాక్షి): మణుగూరు మండలం లోని పలుచోట్ల సరుకు రవాణా ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం అశోక్ నగర్ లో ట్రాన్స్పోర్ట్ కార్యాలయ ముందు నిలుపుదల చేయాల్సి ఉండగా ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ప్రధాన రహదారి పై నిలుపుదల చేసి అక్కడ నుంచి వేరే వాహనాలకు సరుకులను దిగుమతి చేస్తున్నారు. దీంతో వచ్చి వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక్కడ భారీ వాహనం నిలపడం వల్ల ఇదే ప్రదేశంలో గతంలో నాలుగు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినా వారి తీరు మారటం లేదు. ఇళ్ల మధ్యన ఇలాంటి సరుకు దిగుమతి కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వారికి వచ్చే పురుగు మందులు, ఎండు చేపలు,మిర్చి కార్పెట్ లాంటి వివిధ రకాల సరుకులను గదులలో నిల్వ ఉంచడం తో దుర్వాసన వెదజల్లుతోంది.దీనివల్ల పక్కనున్న కుటుంబాలు అనారోగ్య బారిన పడుతున్నారు. సరుకు రవాణా కార్యాలయాలు గోడౌన్ లు నివాసయోగ్యం లేని చోట ఏర్పాటు చేసుకోవాలని ఇళ్ల మధ్యన చేసుకోకూడదనే విషయాన్ని స్థానిక ప్రజలు నిర్వాహకులు అడిగితే ఇంకా ఎక్కడ పెట్టుకుంటారని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. వాళ్లు వాడుకునే షాపు కాకుండా ఇరుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి ముందు కూడా వాహనాలు నింపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఇంటిముందు అడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. మా ఇంటి ముందు వాహనాలు తీయమని చెప్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు అని గంటలు గంటలు అలానే ఉంచుతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చుట్టుపక్కల వారు ఎవరు అడిగిన వారి మీద గొడవ దిగుతున్నారు. రోడ్డుమీద ద్విచక్ర వాహనం ఆటోలు తోపుడు బండ్లు నిలుపుదల చేస్తే ఫైన్లు వేస్తున్నారు కానీ ఇలాంటి భారీ వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వానాలకెందుకు ఫైన్ విధించడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు, పోలీసు శాఖ వారు స్పందించి భారీ వాహనాలను ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.