నన్ను వేశ్య అంటావా?
– భాజాపాను దేశం క్షమించదు
– నిప్పులు చేరిగిన బహెన్ మాయవతి
న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి): యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మాయావతిని వేశ్య అని చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన మాయావతి ఆ పదం ఉచ్ఛరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. తననంటే ఆయన తన కూతురు, సోదరిని అన్నట్లే అంటూ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌లో అందరూ తనను సోదరిగా భావిస్తారని, అలాంటి తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి సోదరిని అవమానించినట్లేనని అన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పట్ల బీజేపీ దారుణంగా వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ పార్టీ ప్రభుత్వంలో కొనసాగాలనుకుంటే దళితులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ విషయంలో జాతి బీజేపీని క్షమించదని ఆమె అన్నారు. దయాశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ప్రజలే రోడ్లపైకి వచ్చి తిరగబడతారని, హింస చెలరేగితే తాను చేయగలిగింది ఏవిూ లేదని హెచ్చరించారు. మాయావతిపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలను సభ ముక్తకంఠంతో ఖండిస్తోందని ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కూడా దయాశంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఇలాంటి అసభ్య పదజాలం వాడిన దయాశంకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాయావతి మాట్లాడటం ముగిసిన తర్వాత ఈ అంశంపై సభలో గందరగోళం నెలకొంది. సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు.