నమ్మిన సిద్దాంతం కోసం పోరాటం

మోడీ విధానాలతో సంపన్నులకే మేలు

ప్రజలెవరూ సంతోషంగా లేరన్న రాహుల్‌

ముంబై,జూన్‌12(జ‌నం సాక్షి ): నమ్మిన సిద్దాంతం కోసం పోరాటం సాగిస్తూనే ఉంటానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త ఒకరు వేసిన క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసులో రాహుల్‌ గాంధీపై బివాండీలోని కోర్టు మంగళవారం ఆరోపణలు నమోదు చేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ విధానాలపైనే మా పోరాటం సాగుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని రైతులెవరూ సంతోషంగా లేరు. యువత ఉద్యోగాల్లేక అల్లాడిపోతోంది. ప్రస్తుత ప్రభుత్వం 15 నుంచి 20 మంచి సంపన్నుల కోసమే పనిచేస్తోంది. విూడియా కూడా హైలైట్‌ చేస్తున్నా మోదీ మాత్రం రైతులు, యువత గురించి పెదవి విప్పడం లేదని రాహుల్‌ విమర్శించారు. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు చుక్కలనంటు తున్నా మోదీ ఒక్కమాట కూడా మాట్లారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. వాళ్లు నావిూద వేర్వేరు కేసులు పెట్టారు. నా పోరాటం మాత్రం సిద్దాంతాల విూదే సాగుతోంది. వారిపై నేను పోరాడుతూనే ఉంటాను…మేం విజయం సాధిస్తాం కూడా అని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆరెస్సెస్‌ ఉందని రాహుల్‌ ఆరోపించిన నేపథ్యంలో ఆరెస్సెస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంతే 2014లో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్‌ గాంధీపై ఐపీసీ సెక్షన్‌ 499, 500 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగనుంది. 2014లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓ ర్యాలీలో మాట్లాడుతూ..1948లో జాతిపిత మహాత్మా గాంధీ హత్య వెనక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గౌరవాన్ని ఈ వ్యాఖ్యలు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ, సంఘ్‌ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. విచారణలో భాగంగా ‘విూరు నేరాన్ని అంగీకరిస్తున్నారా?’ అని న్యాయమూర్తి రాహుల్‌ను ప్రశ్నించారు. అందుకు ‘నేను నేరాన్ని అంగీకరించడం లేదు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. భాజపా, సంఘ్‌ తనపై ఎన్ని కేసులు వేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విూద చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొంటే కేసును వెనక్కి తీసుకోవడానికి సిద్ధమేనని గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. కానీ అందుకు రాహుల్‌ అంగీకరించలేదు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనే ఉద్దేశమే లేదు. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.