నయాసాల్‌ జోష్‌ 

చికెన్‌ ధరలకు రెక్కలు
హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్‌ చేస్తున్న మాంసం ప్రియులకు చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కోడి ధరలు అమాంతంగా పెంచేసిన వ్యాపారులు పెంచిన ధరలకు అమ్ముతున్నారు. దీంతో తాజా ధరలు ధరలు మటన్‌తో పోటీ పడుతున్నాయి. ఈ శీతాకాలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న వేళ చికెన్‌ వినియోగం పెరిగింది. మరోవైపు నయాసాల్‌ జోష్‌ వస్తోంది.  దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోతున్నదని  చెబుఏఉతన్న వ్యాపారులు ధరలు పెంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు  చికెన్‌ ధరలు ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన దాఖాలాలు లేవని వాపోతున్నారు. నెల రోజుల క్రితం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ. 130 నుంచి 160 ఉండగా, నేడు రూ. 240 చేరింది. డ్రెస్సింగ్‌ చికెన్‌ కిలో రూ. 220, లైవ్‌ కోడి కిలో ధర రూ. 120 పలుకుతోంది. దీంతో చికెన్‌ తినాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త సంవత్సరం ఎలాగూ కొనుగోళ్లు తప్పవని గుర్తించి వ్యాపారులు ధరలను ఇష్టానుసారం పెంచుతున్నారని చికెన్‌ ప్రియులు వాపోతున్నారు. అయితే తమ చేతుల్లో ఏవిూ లేదని, రాష్ట్రం అంతా ఒకటే దరలు ఉంటాయని అంటున్నారు.  ఇక గుడ్డు ధర రూ. 3.50 నుంచి ఏకంగా రూ. 5 చేరింది. ఫారాల్లో కోళ్ల ఉత్పత్తులు తగ్గడంతో మార్కెట్‌లో కోడికి డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు చలికి కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుండడంతో ఆశించిన మేర ఉత్పత్తి లేక కోడి ధర ఆకాశాన్నంటినట్లు వ్యాపార వర్గాలు అంటున్నాయి. రాబోయే రోజుల్లో చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.  సామాన్య, మధ్య తరగతి ప్రజలు చికెన్‌ తినడం సర్వసాధారణం కావడంతో వినియోగం కూడా పెరుగుతోంది. ఓ పక్క నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. దీనికితోడు మార్కెట్‌లో రోజరోజుకు కోడి మాంసం ధరలు పెరుగుతుండడం సామాన్య ప్రజానీకానికి ఆందోళన కలిగిస్తోంది. కోడి ధరతోపాటు గుడ్డు ధర కొండెక్కింది. ఈ ధరలు సామాన్య ప్రజలపై భారం పడేలా చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా భారీగా ధరలు పెరగడంతో ప్రజలు చికెన్‌ కొనుగోలు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇటు వ్యాపారులూ కోళ్లు కొనలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కోళ్ల ఫారాల యజమానులు తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడంతో కోళ్ల కొరత కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. దీనికితోడు ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటారు. పరిస్థితుల ప్రభావంతో మార్కెట్‌లో ధరలు పెరుగుతుండడం వ్యాపారం లాభసాటిగా సాగడం లేదన్నది చికెన్‌ షాపుల యాజమానులు అంటున్నారు. మరోవైపు  ధరలు విపరీతంగా పెరగడంతోపాటు కోళ్లు సకాలంలో సరఫరా కాక వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని వ్యాపారులు  వాపోతున్నారు.