నరేంద్రనాథ్ స్ఫూర్తితో సేవాకార్యక్రమాలు చేపట్టాలి
సంగారెడ్డి, నవంబర్ 23 : స్వంత లాభం నుండి లోకకల్యాణం కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేసి సామూహిక వివాహాలు జరిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి చాగండ్ల నరేంద్రనాథ్ అని లోకాయుక్త చైర్మన్, న్యాయమూర్తి సుభాషన్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారంనాడు మెదక్ జిల్లా చేగుంట మండల వడియారం వద్ద ఎస్‌ఎల్‌విఎన్ మ్యారేజ్ హాల్‌లో జరిగిన సామూహిక వివాహాలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వంత డబ్బులతో 108 జంటలను ఏకం చేసిన ఘనత నరేంద్రనాథ్‌కే దక్కుతుందన్నారు. పెళ్లి చేయాలంటే వ్యయ ప్రయాసలతో, ఖర్చుతో కూడుకున్న విషయమని అన్నారు. పెళ్లి చేయడంతో పాటు వధూవరులకు పట్టు బట్టలు, పుస్తే మెట్టెలు, వంటసామాగ్రితో పాటు మంచం, బీరువాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దీంతో పాటు దంపతుల కుటింబీకులకు ఇంటివరకు పంపించడం అతని విశాల హృదయానికి నిదర్శనమన్నారు పుణ్యకార్యక్రమాలతో పాటు విద్య, వైద్య, మంచినీరు, వసతులు, స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పించడం చాలా గొప్ప విషయమని ఆయన చేపడుతున్న సేవలను అభినందించారు.