నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

 వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి నవంబర్19
   నర్సరీల నిర్వహణ పకడ్బందీగా  నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు.  శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హరితహారం నర్సరీల నిర్వహణపై అవగాహన, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు,  పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనుల పురోగతిపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలతో మండలాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈసారి హరితహారంకు అవసరమైన మొక్కలను అందించేందుకు ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని అన్నారు.  అవసరమైన నాణ్యమైన విత్తనాలను స్థానికంగా సేకరించి విత్తాలన్నారు.  మంచి రకం ప్లాస్టిక్ బ్యాగ్ లను వినియోగించి అందులో ఎర్ర, నల్ల మట్టి మిక్స్ చేసి నింపాలని సూచించారు.  మట్టిలో ఒక ఇంచు లేదా సగం ఇంచు కంటే ఎక్కువ లోపలకు విత్తనాలను విత్త కూడదని అన్నారు.  ప్రతి నర్సరీలో ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచాలన్నారు.  ప్లాస్టిక్ బ్యాగులలో విత్తిన మొక్కలు మొలకెత్తని స్థానంలో ప్రైమరీ బెడ్లలో పెంచిన మొక్కలను అట్టి స్థానంలో రీప్లేస్ చేయుటకు వీలు పడుతుందని అన్నారు. వేసవి కాలంలో అన్ని నర్సరీలలో మొక్కలకు ప్రతిరోజు రెండుసార్లు ఉదయం 10:00 గంటలకు ముందు, సాయంత్రం 04:00 గంటల తర్వాత నీరు పట్టాలని అన్నారు. మొక్కలకు జీవామృతం వాడినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయని తెలిపారు.  నర్సరీలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు  శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని డి ఆర్ డి ఓ, డీఎఫ్ఓలకు సూచించారు.  ఈనెల 25 వరకు గ్రామ పంచాయతీల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అందజేయాలని అన్నారు.  ప్రైవేటు స్థలాలలో నిర్వహిస్తున్న నర్సరీలను వెంటనే అనువైన ప్రభుత్వ  భూములలో  మార్చాలని సూచించారు. ఈనెల 25 వరకు  మట్టి సేకరణ బ్యాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు.  తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని అన్నారు.  ఎంపీడీవోలు, తహసీల్దారులు సమిష్టిగా పనులను వేగాంతం చేసి పూర్తి చేయాలని సూచించారు.  పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలను, ప్రభుత్వం చేపడుతున్న పనులను  వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు.  అంతకుముందు అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కృష్ణన్, డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.