నర్సింగ్‌ యాదవ్‌కు క్లీన్‌చిట్‌

1

– రియో ఒలింపిక్స్‌కు అర్హత

న్యూఢిల్లీ,ఆగస్టు 1(జనంసాక్షి): రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నాడా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అతడు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చని స్పష్టంచేసింది. దీంతో అతను రియో ఒలంపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందాడు. నర్సింగ్‌ యాదవ్‌ను కుట్ర చేసి డోపింగ్‌లో ఇరికించారని నాడా తెలిపింది. డోపింగ్‌లో నర్సింగ్‌ తప్పిదం, నిర్లక్ష్యం ఏవిూ లేదని, ప్రత్యర్థి కుట్రకు అతను బలయ్యాడని నాడా పానెల్‌ తేల్చిచెప్పింది. దీంతో డోపింగ్‌ వివాదంలో ఇరుక్కున  రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌కు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా  నర్సింగ్‌ చుట్టూ అలుముకున్న డోపింగ్‌ వివాదానికి  జాతీయ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్‌ స్టాప్‌ పెట్టింది. డోపింగ్‌ వ్యవహారంలో నర్సింగ్‌ కు క్లీన్‌ చిట్‌ ఇస్తూ నాడా  తుది నిర్ణయం తీసుకుంది. ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో వారు తీసుకునే ఆహారపానీయాలను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండటం అథ్లెట్లకు సాధ్యం కాదని ఈ సందర్భంగా పానెల్‌ అభిప్రాయపడింది. నర్సింగ్‌ యాదవ్‌ నిర్దోషని స్పష్టంచేసింది. నాడా క్లీన్‌చిట్‌పై నర్సింగ్‌ మద్దతుదారులు హర్షంవ్యక్తంచేశారు. నాడా కార్యాలయం ఎదుటే స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. రియో ఒలింపిక్స్‌ 74 కేజీల విభాగంలో నర్సింగ్‌ తలపడబోతున్నాడు. ఇంతకుముందు బీజింగ్‌, లండన్‌ ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌ సుశీల్‌ కుమార్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని కోర్టుకు వెళ్లినా అక్కడా నర్సింగ్‌ యాదవ్‌ కే అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం తెలిసిందే.  నాడా-2015 యాంటీ కాపీయింగ్‌ నిబంధనల్లోని ఆర్టికల్‌ 10.4 ప్రకారం నర్సింగ్‌ కు అవకాశం కల్పించింది. దీంతో రియో ఒలింపిక్‌స్లో 74 కేజీల రెజ్లింగ్‌ విభాగంలో నర్సింగ్‌ పాల్గొనేందుకు దాదాపు లైన్‌ క్లియరయ్యింది. ఈ మేరకు తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్ర ప్రకటించిన నాడా.. డోపింగ్‌ వివాదంలో నర్సింగ్‌ తప్పిదం లేదని పేర్కొంది.  ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్‌ బలయ్యాడని స్పష్టం చేసింది. ఈ విషయంలో అసలు నర్సింగ్‌ ప్రమేయం లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్‌ నవీన్‌ అగర్వాల్‌ తెలిపారు.  అయితే  ఈ విషయాన్ని వాడా (వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) కి నాడా నివేదించనుంది. గత నెల్లో నర్సింగ్‌ పై డోపింగ్‌ వివాదం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈనెల 5న హరియాణాలోని సోనేపట్‌ భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో నర్సింగ్‌కు డోపింగ్‌ పరీక్ష నిర్వహించగా అతను నిషేధిత ఉత్పేర్రకం మెథాన్‌డైనన్‌ వాడినట్లు తేలింది. అయితే దీనిపై నర్సింగ్‌ పలు ఆరోపణలు చేశాడు. తనను కావాలనే కుట్రలో ఇరికించారని పేర్కొన్నాడు.  దీనిలో భాగంగా నాడాను ఆశ్రయించాడు. ఇప్పటికే నర్సింగ్‌ యాదవ్‌ వాదనలను పలుమార్లు విన్న నాడా చివరకు అతనికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డోపింగ్‌ వివాదాన్ని భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్యూఎఫ్‌ఐ)కూడా సీరియస్‌ గా తీసుకుని నర్సింగ్‌ కు మద్దతుగా నిలిచింది.మరి గేమ్స్‌ కు వెళ్లే ముందు ఇన్ని పోరాటాలు చేసిన నర్సింగ్‌.. ఒలింపిక్స్‌ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.