నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
– మెడికల్ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి
– నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్గొండ, ఫిబ్రవరి11(జనంసాక్షి) : నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని నల్లగొండ
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అటవీ సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో అర్హులైన 41మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబి జెండాను గెలిపించారని, వచ్చే స్థానిక, ఎంపీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ కు అండగా ఉండాలన్నారు. నల్లగొండ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ హావిూ ఇచ్చారని, దాన్ని నెరవేర్చే కార్యాచరణ మొదలైందన్నారు. గత ఎమ్మెల్యే రెండు దశాబ్దాలుగా అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. నల్లగొండ అభివృద్ధికి రూ.37 కోట్లు సీఎం తన ప్రత్యేక నిధి నుంచి కేటాయించడం జరిగిందన్నారు. రేపటి నుంచి ఈ నిధులతో పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రూ.153 కోట్లతో నల్లగొండ పట్టణ అభివృద్ధికి డీపీఆర్ రూపొందించామని అప్పటి మంత్రి కేటీఆర్ కు నివేదించాం. ఇప్పటికే రూ.100 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని, శంకుస్థాపనకు త్వరలో సీఎం కేసీఆర్ రాబోతున్నారని తెలిపారు. వచ్చే ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, మరింత అభివృద్ధికి చేయూత నివ్వాలని ఆయన కోరారు.