నల్గొండ పట్టణ డ్రైనేజీ వ్యవస్థ పై సర్వే చేసి వివరాలు ఇవ్వాలి

ఎమ్మెల్యే కంచర్ల. కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్లగొండ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థపై ఏజెన్సీ వారితో సర్వే చేయించి సమగ్ర వివరాలతో ప్రణాళికలు సిద్దం చేయాలని ఎమ్మేల్యే కంచర్ల భూపాల్  రెడ్డి తెలిపారు. గురువారంనాడు నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మతో కలిసి సమీక్షించారు.  ఈ సందర్భంగా నల్లగొండ శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ అభివృద్దిలో భాగంగా అమృత్ స్కీమ్ 2.0 కింద నల్లగొండ పట్టణానికి 216 కోట్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఆ నిధులతో పట్టణంలోని మురుగు నీరు, వర్షపు నీరు, వరద నీరు పోయే విధంగా డ్రైనేజీ పనులు చేయవలసి ఉన్నది. అందుకోసం ప్రతిపాదనలు సిద్దం చేయడంతోపాటు ఏ ఏ ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కువగా వస్తున్నాయే, ఎక్కడ ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయినదో ఆయా ప్రాంతాలను గుర్తించడానికి వార్డు కౌన్సిలర్లు ఇంజనీర్లకు, ఏజెన్సీ వారికి సహకరించాలని ఆయన తెలిపారు. నల్లగొండ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థపై ఏజెన్సీ వారితో సర్వే చేయించి సమగ్ర వివరాలతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  మంచి నీటి సదుపాయం కోసం 56 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఏ ఏ ప్రాంతాలలో మంచి నీటి ట్యాంకులు అవసరమో గుర్తించాలని మున్సిపల్ కమీషనర్ ను కోరారు. అన్ని అంశాలతో డి.పి.ఆర్.లు సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక అండర్ గ్రౌండు డ్రైనేజీ పనులు ఫేస్-2 పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను, ఇంజనీర్లను కోరారు. డ్రైనేజీ పనులలో భాగంగా గతంలో జరిగిన పనులను పరిశీలించి వాటికి అవసరమైన రిపేర్లు చేసి అనుబంధంగా నూతన డ్రైనేజీ వ్యవస్థను కలుపుతామని ఆయన అవగాహన కలిగించారు. మురుగు నీరు, వ్యర్దాలు డ్రైనేజీలో జామ్ అయి నీరు నిలిచిపోయి ఓవర్ ఫ్లో అవుతున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో అక్కడక్కడా మంచి నీటి సమస్య ఉన్నందున వాటి సమస్యకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను కోరారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లడుతూ, జిల్లా మంత్రి పనులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిపాలన అనుమతులు మంజూరు చేయిస్తున్నారని ఆయన అన్నారు.  పట్టణ జనాభాకు సరి పోయే విధంగా డ్రైనేజీ వ్యవస్థ ముఖ్యంగా మురుగు నీరు, వర్షపు నీరు, వరదల వచ్చినప్పుడు ఎక్కడా నీరు నిలువ కుండా పోయే విధంగా తగు ప్రణాళికలు సిద్దం చేయాలని సంబంధిత ఏజేన్సీ, ఇంజనీర్లను ఆదేశించారు. అధికారులు, ఇంజనీర్లు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని పనులకు సంబంధించిన ప్రణాళికల కోసం పట్టణంలోని వార్డులలో పర్యటించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బండారు ప్రసాద్, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు