నవాబుపేట రిజర్వాయర్‌తో తీరనున్న కష్టాలు

ప్రాజెక్ట్‌ నిర్మానం కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు

మెదక్‌,జూన్‌26(జ‌నం సాక్షి): సాంబయ్య చెరువును 1.5 టీఎంసీ రిజర్వాయర్‌గా మారనుండడంతో శివ్వంపేట మండలానికి జలకళ రాబోతోంది. నవాబుపేట సాంబయ్య చెరువును రిజర్వాయర్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడా రిజర్వాయర్లు లేవు. నవాబుపేటలో రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు పండుగలా మారే అవకాశం లేకపోలేదు. కొండపోచమ్మ ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా నవాబుపేటలో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌లో నీరు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాంబయ్య చెరువు ఎత్తయిన ప్రాంతంలో ఉంది. చుట్టు కొండలు, గుట్టలు ఉండడంతో ప్రాజెక్టుకు నిర్మాణానికి అనువుగా ఉంది. అచ్చం శ్రీశైలం ప్రాజెక్టును పోలి ఉండటం మరో విశేషం. ఈ మినీ రిజర్వాయర్‌ ద్వారా మండలంలో 170 చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయనున్నారు. మండల వ్యాప్తంగా 52 వేల ఎకరాల భూమి ఉండగా ఇందులో 12 వేల ఎకరాలు మాత్రమే వ్యవసాయేతర భూమి. మిగతా భూమిలో ఈ రిజర్వాయర్‌ ద్వారా రెండు పంటలకు సాగునీరందనుంది. రిజర్వాయర్‌ ఏర్పాటులో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక చొరువ చూపిస్తున్నారు. సాంబయ్య చెరువును 1.5 టీఎంసీ రిజర్వాయర్‌గా మార్చి రైతులకు నీటి కష్టాలు తీర్చాలని పట్టుదలతో ఉన్నారు. ఈమేరకు పక్షం రోజుల క్రితం ఇంజినీర్ల బృందాన్ని చెరువు వద్దకు పరిశీలన కోసం తీసుకువచ్చారు. త్వరలో మంత్రి హరీశ్‌రావు చేతుల విూదుగా రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయించే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఇటు తాగునీటికి..అటు సాగుకు పుష్కలంగా నీరు లభించనుంది. శివ్వంపేట మండల వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లోని ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మండలంలో రెండు పంటలు వ్యవసాయ బోరుబావుల ద్వారానే సాగవుతోంది. రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తుండగా, రబీలో బోరుబావులను నమ్ముకోవాల్సి వస్తుంది. సాగుకు నీరులేక, బీడు భూములు వెక్కిరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రాంతంలో రిజర్వాయర్‌ నిర్మాణ అంశం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ నగరానికి నవాబుపేట గ్రామం దగ్గరగా ఉండటంతో రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.