నష్టాల నుంచి తేరుకున్న స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జూన్‌15(జ‌నం సాక్షి ) : శుక్రవారం దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాాచైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ పరిస్థితులు రేకెత్తడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడటంతో ఆరంభ ట్రేడింగ్‌ నుంచే సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 10,800 మార్క్‌ కింద ట్రేడ్‌ అయ్యింది. అయితే చివరి గంటల్లో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేర్లపై బైబ్యాక్‌ను ప్రకటించడం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ఇతర ఐటీ, ఫార్మా రంగాల షేర్లు కూడా రాణించడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకున్నాయి. చివరకు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 35,622 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10,818 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.97గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిఎ/ాలా, టీసీఎస్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. హిందాల్కో, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, యస్‌ బ్యాంక్‌, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి.