నాకు విముక్తి కల్పించండి
– గుజరాత్ సీఎం ఆనందీబెన్ రాజీనామా
అహ్మదాబాద్,ఆగస్టు 1(జనంసాక్షి):వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల అక్కడ శాంతిభద్రతలు, దళితులపై దాడులు తదితర అంశాల నేపథ్యంలో ఆమెరాజీనామాప్రాధాన్యం సంతరించుకుంది. 75 ఏళ్ల వయసు నిండినవాళ్లు పదవిలో కొనసాగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. తనకు 75 ఏళ్లు నిండగానే ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా గతంలోనే పార్టీని కోరానని ఈ సందర్భంగా ఆనంది వెల్లడించారు. ఇన్నాళ్లుగా తనపై నమ్మకంతో ఎన్నో గురుతర బాధ్యతలు అప్పగించిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్లుగా బీజేపీకి సేవ చేస్తున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. నవంబర్‌తో ఆమెకు 75 ఏళ్లు నిండనున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు, గుజరాత్ వైబ్రంట్ సదస్సుకు సంబంధించిన బాధ్యతలు తాను ఇప్పటికే అందరికీ అప్పగించానని రాజీనామా సందర్భంగా ఆనంది వెల్లడించారు. పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు సాధ్యమైనంత సేవ చేయడానికే తాను ప్రయత్నంచినట్లు ఆమె వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారని, సీఎం రాజీనామా తమకు అందిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. వయసు పైబడినందున సీఎంగా తప్పుకొనేందుకు తనకు అవకాశమివ్వాలని అధిష్ఠానానికి ఆనందీబెన్ విజ్ఞప్తి చేశారు. యువతకు అవకాశం ఇచ్చేందుకు ఆ పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో వివరించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. గుజరాత్ సీఎం ఆనందీబెన్ రాజీనామా అందిందని, పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కొంత కాలంగా ఆనందీ బెన్‌ను తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని ఇలా బయటపెట్టారు. వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సిఎం రేసులో నితిన్ పటేల్, విజయ్ రూపాణి ఉన్నారు.