నాలుగేళ్లలో తెలంగాణను అగ్రభాగాన నిలిపాం

– మరోసారి ఆశీర్వదించండి
– బంగారు తెలంగాణకు తోడ్పాటునందించండి
– మహాకూటమి మాయమాటలను ఓటుతో తిప్పికొట్టండి
– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నిర్మల్‌, డిసెంబర్‌01(జ‌నంసాక్షి) : నాలుగేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికే అగ్రభాగాన నిలిపిన ఘనత తెరాస ప్రభుత్వానిదని, ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించి బంగారు తెలంగాణకు తోడ్పాటును అందించాలని ఆపద్ధర్మ మంత్రి, నిర్మల్‌ తెరాస అభ్యర్ధి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ జిల్లా మామడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి మరోసారి ఆశీర్వదిస్తే అందుబాటులో ఉండి ప్రజలకు సేవచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుబడతానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందామని, అందుకే మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి వస్తున్నాయని, వారి కళ్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్న చంద్రబాబును తెలంగాణ ప్రజలు తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద కుటుంబాలకు పింఛన్లు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి తదితర పథకాలతో ఆ కుటుంబాలను పెద్ద కొడుకులా సీఎం కేసీఅర్‌ ఆదుకుంటున్నాడన్నారు. ప్రజా క్షేమమే తన క్షేమంగా, ప్రజా ఊపిరే తన ఊపిరిగా, ప్రజా సమస్య తన సమస్యగా అనుకొని సుపరిపాలనను సాగించాడన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరించి ముందుకు సాగుతున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మొదటి స్థానంలో కొనసాగుతుందంటే అది సీఎం కేసీఆర్‌ వల్లనే తప్ప, మరోటి కాదన్నారు. టీఆర్‌ఎస్‌ హయంలోనే అన్ని వర్గాల అభివృద్ది జరిగిందని, అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ విజయం సాధించాలని వివరించారు. కేసీఆర్‌ను మరో సారి సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీహరి రావు,రాంకిషన్‌ రెడ్డి.డా.మల్లికార్జున రెడ్డి తదితరులు ఉన్నారు.