నాలుగేళ్లలో రూ.5.20లక్షల కోట్లు ఖర్చు చేశాం
103కుపైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం
కేంద్రం ఇచ్చింది రూ. 12,879కోట్లు మాత్రమే
ా విపక్షాల విమర్శలు హాస్యాస్పదం
ప్రజలకు కనిపించిన అభివృద్ధి.. విపక్షాలకు కనపడటం లేదు
ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల
అమరావతి, జూన్8(జనం సాక్షి) : నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ. 5.20లక్షల కోట్లు ఖర్చు చేశామని, టీడీపీ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధి.. విపక్షాలకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాభివృద్ధికి నాలుగేళ్లలో రూ.5.20 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, హావిూల అమలు కోసం రుణాలు కూడా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. బడ్జెట్ కేటాయింపులు కంటే ఎక్కువే ఖర్చుచేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటి కంటే అదనంగా.. 103కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలియజేశారు. ఉద్యోగులు, ఇతర సంఘాలు ఏది అడిగినా అభ్యంతరం తెల్పలేదన్నారు. అందరూ సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాలుగేళ్ళలో సగటు వృద్ధి రేటు 10.5శాతంగా ఉందన్నారు. కేంద్రం నుంచి ఆశించినరీతిలో స్పందన లేదని వెల్లడించారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది రూ.12,879 కోట్లు మాత్రమేనని వివరించారు. రెవెన్యూ లోటు మరో రూ.12వేల కోట్లపైనే రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చట్టప్రకారం రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని యనమల వాపోయారు. పైగా మేం నిధులిచ్చామంటూ బీజేపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లలో కేంద్రం ఏపీ అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని, ఫలితంగా అరకొర నిధులతో చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందన్నారు. 29సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి విభజన హావిూల విషయం ప్రశ్నించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో నాలుగేళ్లు ఓపిగ్గా ఉన్నా.. ఇక ఉపయోగం లేదని కేంద్రం నుంచి బయటకు రావటం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ పార్టీని, అందుకు సహకరించే వైసీపీకి ప్రజలు తగిన
గుణపాఠం చెబుతారని యనమల హెచ్చరించారు.