నాలుగేళ్లుగా హావిూల అమలు ఏదీ?

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి

మెదక్‌,జూలై30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా నాలుగేళ్లుగా అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. మాయమాటలతో ఇష్టారీతిన లెక్కలు మారుస్తున్నారన్నారు. తెలంగాణ ధనికరాష్ట్రమని చెబుతున్న సిఎం కెసిఆర్‌ రైతాంగానికి ఎందుకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణలో అన్నీ సాధించామని గొప్పలు చెప్పకుండా సమస్యలపై చిత్తశుద్దితో దృష్టి సారించాలని అన్నారు. తెరాస పాలనలో రాష్ట్రం భూకబ్జాలు, ఇసుక మాఫియా, కల్తీ విత్తనాలు, ఆహర పదార్థాలకు అడ్డాగా మారగా.. నేరస్థులకు, డ్రగ్స్‌ విక్రయాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. గతంలో నయీం, మియాపూర్‌ భూకబ్జా కేసుల మాదిరిగానే డ్రగ్స్‌ కేసును నీరుగార్చారని అన్నారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిరద్యోగులను మోసం చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతుందని.. కానీ మొక్కల పేరుతో వేల కొట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడడాన్ని ఖండిస్తునామని అన్నారు. రాష్ట్రంలో గతంలో నిర్వహించిన హరితహారానికి చేసిన ఖర్చుతో పాటు సంరక్షణ అనంతరం మిగిలిన మొక్కల సంఖ్యను ప్రకటించాలన్నారు.