నాలుగేళ్లు ఎన్నో మైలురాళ్లు అధిగమించాం

సమిష్ఠి కృషి, ప్రజా సహకారంతో సాధ్యమైంది
మన కృషికి ప్రకృతి కూడా కలిసొస్తుంది
టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్‌8(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని… సమష్టి కృషి, ప్రజా సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘మహా సంకల్పం’ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆరు రోజుల పాటు దీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని చివరి రోజు మరింత స్ఫూర్తివంతంగా చేయాలని అన్నారు. మన శక్తి, స్థాయి ‘మహాసంకల్పం’లో ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. ప్రతినెలా ఇదేరోజు ‘మహా సంకల్పం’ పురోగతిని సవిూక్షించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం పోటీబడి అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గ్రామాలకు రాకపోకలు సులభతరం అయ్యాయని.. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్లోనే ఉండిపోవాలన్న స్ఫూర్తి తనకే వస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో ఏ ఊళ్లో చూసినా దుమ్ము, బురద, చెత్తాచెదారం ఉండేవని.. ఇప్పుడు ప్రతి ఊళ్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు, ఓడీఎఫ్‌లతో పచ్చదనం పెరిగిందన్నారు. మా ఇంటిపేరు ఆనందం – మా ఊరిపేరు పరిశుభ్రత అనే సంస్కృతి రాష్ట్రం మొత్తం విస్తరించాలని కోరారు. పౌరసేవలు సులభతరం చేశామని.. మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవ నిర్మాణ దీక్షలలో వర్షం మనవెంటే వస్తోందని… రైతులకు, వ్యవసాయానికి ఇది శుభసంకేతమని సీఎం తెలిపారు. మన కృషికి ప్రకృతి కూడా కలిసివస్తోందని అన్నారు.