నాల్గవ విడత హరితహారంలో..
40కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
– నెలాఖరులో గజ్వేల్‌లో కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభిస్తారు
– హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
– రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న
సిద్దిపేట, జులై21(జనం సాక్షి) : రాష్ట్రంలో నాలుగో విడత హరితహారానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని, ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం సిద్దిపేటలోని కోమటిబండ, సంగాపూర్ అడవుల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ నెలఖారులో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నాలుగో విడుత హరితహారంలో భాగంగా 40 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. గజ్వేల్‌లో ఇతర సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలతో పాటు హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. నాలుగో విడుత హరితహారాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. అక్కడ విస్తారంగా వర్షాలు పడటంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అటవీశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో హరితహారం ప్రారంభ వేదికను గజ్వేల్‌కు మార్చారన్నారు. గత మూడు విడతల్లో బాగంగా హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారని, అదేరీతిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతి ఒక్కరిని నాల్గో విడత హరితహారంలో భాగస్వాములను చేయడం ద్వారా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, వాటిని రక్షించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి సూచించారు.