నా ఆత్మహత్యకు మోహన్‌రెడ్డే కారణం, సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి

naa* సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి
* ముందు ఫిర్యాదు చేసి, తర్వాత మాటమార్చిన కూతురు

‘నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని సూసైడ్ నోట్ రాసిన కరీంనగర్ జిల్లా విద్యానగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం, పురుగుల మందు తాగిన ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, మంగళవారం వేకువజామున మృతి చెందాడు. అతను రాసిన సూసైడ్‌నోట్‌లో ‘నేను అందరూ నావాళ్లు అనుకుని సాయం చేసిన. కానీ నన్నెవరూ అర్థం చేసుకోలేదు.

మీ నుంచి నేను వెళ్లిపోతున్నందుకు క్షమించగలరు. నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ అని రాసి ఉంది. నారాయణరెడ్డిది బెజ్జంకి మండలం గుండపల్లి కాగా, విద్యానగర్‌లో ఉంటున్నారు. కుమారుడు వంశీధర్‌రెడ్డి, కూతురు తిరుమల ఉన్నారు. ఆత్మహత్య అనంతరం నారాయణరెడ్డి కూతురు గంగ తిరుమల, తల్లి చాడ లక్ష్మితో కలసి మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలే కారణమని, ఈ మేరకు తన తండ్రి సూసైడ్‌నోట్ రాశారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రికి స్వగ్రామంలోని రెండెకరాల భూమి ఉండేదని, ఐదేళ్ల క్రితం శ్యాంసుందర్‌రెడ్డి ద్వారా ఏఎస్సై మోహన్‌రెడ్డి వద్ద ఆ భూమిని తనఖా పెట్టి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడన్నారు.

వడ్డీతో కలిపి మొత్తం చెల్లించినా ఆ భూమి పత్రాలు తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇంటికొచ్చిన తన తండ్రి నోటి నుంచి నురగ రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. తన తండ్రి జేబులో సూసైడ్ నోటు లభించిందని ఫిర్యాదులో తెలిపారు. అయితే, మధ్యాహ్నం మళ్లీ తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె మరో పిటిషన్ ఇచ్చారు.‘సోమవారం తన తండ్రికి కడుపు నొప్పి ఎక్కువకావడంతో ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. మా నాన్న చావుకు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తొలుత మోహన్‌రెడ్డే కారణమంటూ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించగా… మోహన్‌రెడ్డి బాధిత సంఘం సభ్యులు వచ్చి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పడంతో వారి మాటలు నమ్మి పొరపాటుగా తప్పుడు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. సూసైడ్ నోట్ కూడా తన తండ్రి రాసింది కాదని ఆమె చెప్పడం గమనార్హం. కాగా, నారాయణరెడ్డి చావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పైండైన ఏఎస్సై మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.