నా కూతురు పేరు జ్యోతి సింగ్‌

3

– నిర్భయంగా వెల్లడించిన తల్లి

న్యూఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): ‘నా కూతురి పేరు జ్యోతిసింగ్‌. ఆమె పేరును వెల్లడించడానికి నేనేవిూ సిగ్గుపడటం లేదు’ అని నిర్భయ తల్లి బహిరంగంగా తన కూతురి పేరును ప్రపంచానికి వెల్లడించారు. యావత్‌ దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం జరిగి నేటికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున.. దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు కిరాతకులు అమానుషంగా సామూహిక అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర హింస ఎదుర్కొన్న ఆమె 13 రోజులపాటు ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచింది. ఆ ఉదంతాన్ని గుర్తుచేసుకొని ఉద్విగ్నులైన నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్‌ తమ కూతురి పేరును వెల్లడించారు. తమ కూతురిపై దురాగతానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితుల్లో చిన్నవాడైన బాలనేరస్తుడిని విడుదల చేయవద్దని ఉద్వేగంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాలనేరస్తుడు ఈ నెల 20న విడుదలకానున్నాడు. ‘నా కూతురి పేరు చెప్పేందుకు నేనేవిూ సిగ్గుపడటం లేదు. హింసకు గురైనవారు తమ పేరును దాచాల్సిన అవసరం లేదు. నేరస్తులు సిగ్గుపడి తమ పేరును దాచుకోవాలి గానీ బాధితులు కాదు. నా కూతురి పేరు జ్యోతిసింగ్‌ అని అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ప్రతిఒక్కరూ ఆమెను జ్యోతిసింగ్‌గా గుర్తించాలి’ అని ఆమె ఢిల్లీలో జరిగిన సభలో ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. బాలనేరస్తుడి విడుదల విషయమై స్పందిస్తూ.. నిర్భయ ఉదంతం మూడేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నిందితుడిని విడిచిపెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? అని ఆమె ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రుల ఈ డిమాండ్‌ పార్లమెంటులో సైతం ప్రతిధ్వనించిన సంగతి తెలిసిందే. బాలనేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఇప్పటికే ఎంపీ హేమామాలిన గళం వినిపించారు.