నా నిశ్శబ్దం సహనం
– నా ఓపికను తక్కువ అంచనా వేయొద్దు
– ఇంకెన్ని కేసులు బనాయిస్తారు?
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ ,జూన్ 11(జనంసాక్షి):”నేను గత ఏడాది కాలంగా నిశ్శబ్దంగా ఉన్నానని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కేంద్రం మా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. నేను సంయమనం పాటిస్తోంది ప్రజలకోసమే. దాన్ని నా చేతగాని తనం అనుకోవద్దు. నా ఓపికను తక్కువగా అంచనా వేయద్దు”ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మాటల యుద్ధానికి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు దిల్లీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నారంటూ ఆరోపించారు.సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఆప్ నేతలపై అనవసరంగా 14అవినీతి కేసులు మోపారు. అవి నిజమైన కేసులయితే వాళ్లని శిక్షించవచ్చు కదా!.ఇంతవరకు వాటికి సంబంధించి ఒక్కర్ని కూడా అరెస్ట్ చేయలేదు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై అవినీతి కేసు బనాయించారు. మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు?. ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే వెంటనే శిక్షించవచ్చు కదా!. మాపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తున్నారు. ప్రధాని మోదీ విద్యారంగం, ఆరోగ్యరంగంలో చేసిన కృషి ఏంటని దేశ ప్రజలందరూ అడుగుతున్నారు. దానికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది? ప్రజల దృష్టిని మళ్లించడానికే దిల్లీ ప్రభుత్వం విూద ప్రతాపం చూపిస్తున్నారు. దేశంలో అక్షరాస్యతను పెంచాలని మనసులో అనుకుంటే సరిపోదు. అది ఆచరణలో పెట్టాలి.’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.ప్రజల వైద్యఅవసరాల నిమిత్తం 10లక్షల మొహల్లా క్లీనిక్స్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.