నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ34
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రోదసీలో మరో చరిత్ర సృష్టించింది. ఒకే రాకెట్ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి సత్తా చాటింది.
బుధవారం ఉదయం 9.26గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన కార్టోశాట్-2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉప గ్రహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది.
వీటిలో ప్రధానమైనది కార్టోశాట్-2సి. దీని బరువు 727.5 కిలోలు, 20 ఉప గ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు, గూగుల్‌కు చెందిన 110 కిలోల స్కైశాట్ కూడా వీటిలో ఉంది.
పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసింది. నింగిలోకి చేరిన పీఎస్‌ఎల్‌వీ ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పట్టింది. పీఎస్‌ఎల్‌వీ సి-34 ప్రయోగం విజయవంత కావడంతో శాస్త్రవ్తేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంసీసీ నుంచి ఇస్రో అధిపతి కిరణ్‌కుమార్, సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు.
ఇవీ ఉపయోగాలు..
* ఇస్రో బుధవారం ప్రయోగించిన కార్టోశాట్-2సి ఉపగ్రహం దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపచేయనుంది. ఇది నిఘాకు సంబంధించి ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వద్ద మాత్రమే ఉన్నాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో దాన్ని సాకారం చేసింది.
* ఇది అంతరిక్షం నుంచి అత్యంత కచ్చితమైన చిత్రాలు, వీడియోలను తీసి, భూమికి చేరవేస్తుంది. ఇందులో ప్యాన్‌క్రొమాటిక్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ పరికరం వల్ల ఈ సామర్థ్యం ఒనగూరింది. గతంలో పంపిన కార్టోశాట్- 2, 2ఎ, 2బి ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 మీటర్ల కచ్చితత్వం ఉంది.
* ప్రస్తుతం పంపే కార్టోశాట్-2సిలో దాన్ని మరింత ఆధునికీకరించి, 0.65 మీటర్ల కచ్చితత్వం సాధించేలా రూపొందించారు.
* కార్టోశాట్-2సి ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది.
* కార్టోశాట్-2సిలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీరప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్‌వర్క్ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి, భూవినియోగతీరుపై మ్యాప్‌లు తయారుచేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు.
* దీని రూపకల్పనకు అయిన వ్యయం రూ.350 కోట్లు. ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది.
ఇదీ గత రికార్డు..
* 2014 జులై 19న రష్యాకు చెందిన డీఎన్‌ఈపీఆర్ రాకెట్ 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు.
* తర్వాతి స్థానం అమెరికాదే. ఆ దేశానికి చెందిన మినోటార్-1 రాకెట్ 2013 నవంబర్ 19న ఒకేసారి 29 ఉపగ్రహాలను మోసుకెళ్లింది.