నిండా ముంచిన’నీలం’
పలు జిల్లాల్లో అపార నష్టం
మరో 24 గంటలు వర్షాలు
హైదరాబాద్, నవంబర్ 2 (జనంసాక్షి):
నీలం తుపాను భారీ నష్టాన్నే మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,900 హెక్టార్లలో పంట నీటి మునిగింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంతో పాటు తమిళనాడు తడిసి ముద్దయ్యింది. ‘నీలం’ కారణంగా జోరుగా వర్షాలు కురుస్తన్నాయి. రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పత్తి, వరి, వేరుశనగ పంట నీట మునిగింది. రాగల 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిం ది. రాయలసీమ పరిసర
ప్రాంతాల్లో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గు కదులున్నాయని, వాయుగుండం, రుతపవనాల ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గన్నవరం 13, తుని 9, ఒంగోలు, బాపట్ల 8, నర్సాపూర్ 6, హైదరాబాద్, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖలలో 4, కర్నూలులో 3 సెంటీవిూటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నీలం తుపాను రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టాన్నే మిగిల్చింది. అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ పంట నష్టం జరిగింది. గుంటూరులో దాదాపు పది వేల ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన వాణిజ్య పంట పత్తి తీవ్రంగా నష్టపోయింది. పూత, పిందెలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు. బాపట్లలో 500 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈస్ట్ డంప్ డ్రైన్‌లోకి వరదనీరు చేరి పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. అటు వరంగల్ జిల్లాలోనూ భారీ నష్టం సంభవించింది. గడిచిన 24 గంటలుగా జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జనజీవనం స్తంభించింది. త్రినగరి, నర్సింపేట, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో వరి పంట నీట మునిగింది. ఈదురుగాలులతో మహబాబూబాద్-ఖమ్మం ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్, ఎల్లారెడ్డిపేట, జగిత్యాల ఐకేపీ సెంటర్లలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మెదక్ జిల్లాల సిద్దిపేట మార్కెట్ యార్డులో 8 వేల బస్తాల మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయ్యింది. దీంతో వ్యాపారులు కొనడానికి తిరస్కరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వర్షంలోనే ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. గన్నవరంలో అత్యధికంగా 18 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. చాట్రాయిలో 17, పెనమలూరులో 16, చందర్లపాడులో 15, నందిగామ, మొవ్వ 12, నూజివీడు, జీకొండూరులలో 10 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.