నినాదాలు కాదు…విధానాలు కావాలి !

దేశంలో గుణాత్మకమార్పు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, మోడీని గద్దెదించడం వంటి నినాదాలు, లక్ష్యాల తో బయలుదేరుతున్న వారు..ముందుగా దేశం కోసం ఎలాంటి ప్రజాకార్యక్రమాలు అమలు చేయబో తున్నారో ప్రకటించాలి. ఇప్పుడు ప్రజలకు భారంగా మారిన మోడీ విధానాలపై స్పష్టమైన విధాన ప్రకటన రావాలి. ఇందులో కాంగ్రెస్‌ కావచ్చు, కెసిఆర్‌ కావచ్చు, శరద్‌పవార్‌ కావచ్చు,మమతా బెనర్జీ కావచ్చు.. లేదా ఇతరులు ఎవరైనా తమ ప్రణాళిక ఏమిటో ప్రకటించాలి. అంతేగాకుండా దాని అమలుకు గల అవకాశా లను కూడా వివరించాలి. అప్పుడే ప్రజలు వారిని నమ్ముతారు. రాబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముందుగానే తమ విధానాలు ప్రకటించడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మోడీకి భిన్నం గా ఏం చేయబోతున్నామో చెప్పగలగాలి. ధరల పెరుగుదలకు కళ్ళెం వేయడంతో పాటుగా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి అత్యవసర చర్యలు ఏమిటన్నది చెప్పాలి. వామపక్ష, ప్రజాతంత్ర,రాజకీయ శక్తులు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రజలకు వాగ్దానం చేయాలి. వారికి ఇదే ప్రాధాన్యతా ఎజెండాగా మారాలి. ధరల పెరుగు దల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్చలను విస్తరించాల్సి వుంది. కేవలం మోడీని తిట్టిపోస్తూ, రాష్టాల్రకు ఏవిూ చేయలేదనో లేకపోతే తామైతే ఇలాచేస్తాం..అలా చేస్తాం అనకుండా ప్రణాళికబద్ద విధానం దేశ ప్రజల ముందుంచాలి. ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణం గుప్పెట్లో నలుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా, గ్రావిూణ, పట్టణ పేదలపై ఈ భారం మరింతగా పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.మే మాసానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.8 శాతంగా వుంది. గత ఎనిమిదేళ్ళలో ఇదే అత్యధికం. ఆహార ధరల ద్రవ్యోల్బణం 8.38 శాతంగా వుంది. గత 17 మాసాల్లో ఇదే అత్యధికంగా నమోదైంది. ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏకంగా 15.08 శాతానికి పెరిగింది. ప్రస్తుత 2011`12 సిరీస్‌ల్లో ఇదే అత్యధికంగా వుంది. సాధారణంగా పేదల నుండి సంపన్నులకు ఆదాయం బదిలీ కావడానికి ఈ ద్రవ్యోల్బణం దారి తీస్తుంది. మార్కెట్‌పై నియంత్రణ కలిగిన కార్పొరేట్లు అధిక ఉపకరణాల వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తారు. మరో పక్క తమ లాభాలను మాత్రం అలాగే కొనసాగిస్తూ వుంటారు. అయితే లోతుగా ఆలోచిస్తే ఈ గణాంకాలు పేర్కొనడం వల్ల సామాన్యులకు ముఖ్యంగా పేదలకు అర్ధం కావు. నిత్యావసరాల ధరలు , కూరగాయలు, వంటనూనెలు, వంట గ్యాస్‌ వంటి వాటి ధరలు పెరిగాయని అర్ధం. దీనివల్ల పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు తక్కువ తినాల్సి వస్తోందని గుర్తించాలి. ఇలాంటి సమయంలో కొనుగోలు శక్తి పోవడంతో వారి పిల్లల కు పోషకాహారం పెట్టడంలో విఫలమవుతున్నారు. కనీస స్థాయిలో బతకడానికి అవసరమైన వస్తువుల ను కూడా కొనలేని నిస్సహాయత వారిని ఆవరిస్తోంది. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారమైన గోధుమల ధర ఏడాది కాలంలో గణనీయంగా పెరిగింది. వంట నూనెల ధరలు లీటరుకు దాదాపు రూ.200పైగానే వున్నాయి. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం కారణంగగా లక్షలాదిమంది ప్రజలు ముఖ్యంగా వీధుల్లో తిరిగి అమ్ముకునేవారు, చిన్నా చితక పనులు చేసుకునేవారు, చిన్నగా వ్యాపారాలు చేసుకునేవారు జీవనోపాధి కోల్పోవడమే. చిన్న, సూక్ష్మ తరహా సంస్థలను బాగా దెబ్బతీస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడం భరించలేనిదిగా తయారయ్యింది. పెట్రోల్‌, డీజిల్‌, ద్రవరూపం లోని గ్యాస్‌లపై కేంద్ర పన్నులు నెమ్మదిగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విధానాలకారణంగా వీటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇది ఉక్రెయిన్‌ యుద్దానికి చాలా ముందుగానే ప్రారంభమైంది. తర్వాత వచ్చిన యుద్ధం ఈ పరిస్థితిని మరింత దుర్భరం చేయడానికి దారి తీసింది. ఇంధనమనేది సార్వజనీన
వస్తువైనందున పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు అన్ని వస్తువుల ధరలపై ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యోల్బణం ఇంత ఆందోళనకర స్థాయిలో పెరిగినా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోంది. ద్రవ్యోల్బణం చూపించే ప్రభావం తక్కువేనని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ వినిమయ వర్గాల్లో వాస్తవ ద్రవ్యోల్బణం రేటులో మార్పును నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టంగా తెలియచేస్తోంది. ఈ విషయాన్ని మోసపూరితంగా దాచి పెడుతోంది. పట్టణ, గ్రావిూణ వర్గాల వారికి, అన్ని గ్రూపుల వారికి ధరలు పెరిగినప్పటికీ సాపేక్షంగా చూసిన్లటైతే ఇతర కేటగిరీల వారికి ఈ ప్రభావం చాలా తక్కువగా వుంటుంది. అందువల్ల వాస్తవ ద్రవ్యోల్బణం రేటు 6.8 శాతం నుండి 5.7 శాతానికి తగ్గినప్పటికీ పట్టణ పేదలు మరింత దారుణంగా దెబ్బతింటారు. పెద్దగా పొదుపు మొత్తాలు లేకుండా, కేవలం వేతనాదాయాలు కలిగిన వారిని ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆహారం కొనుగోలు చేసేవారిని నేరుగా ఈ ద్రవ్యోల్బణం దెబ్బ తీస్తుంది. ఇక సంపన్న, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఆర్థిక సాధనాలు, స్టాక్‌ మార్కెట్‌ల ద్వారా తమ ఆదాయాలను కాపాడుకో గలుగుతారు. ఈ స్టాక్‌ మార్కెట్లలో ద్రవ్యోల్బణం రేటుతో పాటు ధరలు కూడా పెరుగుతాయి. అందువల్ల వారు చాలా వరకు తమ ఆదాయాలను రక్షించుకోగలుగుతారు. సంపన్నులకు వున్నట్లుగా, ఆదాయాల్లో ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పేదలకు మరే ఇతర యంత్రాంగాలు వుండవు. ధరల పెరుగుదలపై పోరాడేందుకు, పెట్రోలియం ఉత్పత్తులపై అన్ని సర్‌చార్జిలను, సెస్సులను తక్షణమే ఉపసంహరించాలని పోరాడితే తప్ప సమస్యకు పరిష్కారం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అదుపులోకి తీసుకురావడానికి ఇదొక్కటే మార్గం. అన్ని నిత్యావసరాలను, ముఖ్యంగా వంటనూనెలు, పప్పు ధాన్యాలను సరఫరా చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. గత రెండేళ్ళుగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రజల ఆదాయాలు, జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈక్రమంలో విపక్షాలు ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలి. ప్రజలకు ఆమోదయోగ్యమైన, ఆచరణసాధ్యమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలి. అప్పుడే విపక్షాలను ప్రజలు నమ్మగలుగుతారు.