నిబంధనలు పాటించని చైతన్య టెక్నో స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్
భూపాలపల్లి టౌన్ జూన్ 27 (జనంసాక్షి)
నిబంధనలు పాటించకుండా పాఠశాల నిర్వహిస్తున్న చైతన్య ఇ-టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ డిమాండ్ చేశారు. సోమవారం పాఠశాల ముందు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర మాట్లాడుతూ… పాఠశాల యాజమాన్యం టెక్నో స్కూల్లో అని తోక పేరు తగిలించుకొని ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటూ పోవడం సరైన పద్ధతి కాదన్నారు. టెక్నో పుస్తకాల పేరిట నర్సరీ విద్యార్థుల పుస్తకాల కోసం రెండు వేల రూపాయలు, మూడవ తరగతి విద్యార్థుల పుస్తకాలకు 3500 రూపాయలు, ఐదో తరగతి విద్యార్థులకు ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అలాగే విద్యార్థులకు అవసరమైన ఆటస్థలం కానీ ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ఇలాంటి సౌకర్యాలు కల్పించకుండా అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అవినాష్, కార్తీక్, కిషోర్, రాజు, సదానందం తదితరులు పాల్గొన్నారు.