నిమ్రుద్ పట్టణాన్ని ధ్వంసం చేస్తున్న ఐఎస్‌ఐఎస్

బాగ్దాద్: ఇరాక్‌లోని చారిత్రక పట్టణం నిమ్రుద్‌ను ఇస్లామిక్ మిలిటెంట్లు ధ్వంసం చేయడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఇరాక్, సిరియాలలో కొన్ని ప్రాంతాలను తమ స్వాధీనంలో ఉంచుకున్న ఇస్లామిక్ మిలిటెంట్లు చారిత్రక పురావస్తు నగరం నిమ్రుద్‌ను గురువారం ధ్వంసం చేశారు. ఈ పట్టణం క్రీపూ 13వ శతాబ్ధంలో కనుగొన్నారు. ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ అధిపతి ఈ ఘాతుక చర్యను యుద్ధనేరంగా పరిగణిస్తామన్నారు. ఆ పట్టణంలోని మందిరాలు, ప్రతిమలు తప్పుడు విగ్రహాలని ఇస్లామిక్ మిలిటెంట్లు చెప్తున్నారు. ఇరాక్ పురాతత్వ శాస్త్రవేత్త లామియా అల్ గిలాని స్పందిస్తూ- ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ దేశ చరిత్రను తుడిచి వేస్తున్నారని పేర్కొన్నాడు.

మోసుల్ నగరానికి ఆగ్నేయంగా 30 కిమీ దూరంలో నిమ్రుద్ పట్టణం ఉంది. ఈ పట్టణంలోని కళాఖండాలను భారీ వాహనాలతో ఉగ్రవాదులు నాశనం చేస్తున్నారు. ఐరాస భద్రతా మండలి వెంటనే సమావేశమై ఇరాక్‌లోని పురాతత్వ సంపద ఎలా కాపాడాలనే అంశంపై చర్చించాలని ఇరాక్ పర్యాటక మంత్రిత్వ శాఖ కోరింది.