నిరుపేదరైతుకూలీలకు శుభవార్త

` వారి ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ
` 28 నుంచి అమల్లోకి మరో పథకం
` అదే రోజు మొదటి విడత రూ.6వేలు అందిస్తాం
` వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా
` అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌రోడ్‌
` గురుకులాలు, ప్రభుత్వ బడులపై నిరంతర పర్యవేక్షణ
` విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారాస తప్పుడు ప్రచారం చేస్తోంది
` ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం(జనంసాక్షి): భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హావిూని ఈనెల 28 నుంచి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన విూడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఏర్పడిన కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబరు 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు రూ.6వేలు ఇస్తామని ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి భారాస రైతులకు ఒరగబెట్టింది ఏవిూ లేదన్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే భారాస నాయకులకు తెలుసన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయనుందని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామన్నారు.
అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌రోడ్‌
అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్‌ రింగ్‌రోడ్‌ ఏర్పాటు చేస్తాం. ఔటర్‌ రింగ్‌రోడ్‌, రీజినల్‌ రింగ్‌రోడ్‌ మధ్య ఇండస్ట్రియల్‌, హౌసింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్‌ తరాలకు అందించబోతున్నాం. రాష్ట్ర అప్పులపై భారాస నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస పాలకులు ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్‌, మిడ్‌ డే విూల్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర బకాయిలు రూ.40,154 కోట్లు. పదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాస ప్రభుత్వం రూ.7,11,911 కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపింది.రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు 2014 నాటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6,400 కోట్లు ఉండగా, పదేళ్లలో భారాస చేసిన అప్పుల వల్ల ఏడాదికి రూ.66,782 కోట్లు చెల్లించే దుస్థితికి భారాస తీసుకెళ్లింది. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్‌ ద్వారా ప్రతి ఏకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకు నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చుచేసింది’’ అని భట్టి విక్రమార్క వివరించారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై భారాస తప్పుడు ప్రచారం
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై భారాస తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి లెక్కలను గణాంకాలతో సహా వివరించారు. పదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అప్పులు చేశారో అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులు కర్షకుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రొత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు
తెలంగాణలోని గురుకులాలు, ప్రభుత్వ బడులను నిరంతరం పర్యవేక్షిస్తామని, రాష్ట్ర భవిష్యత్తుకు వారధులైన విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారాస హయాంలో ఆర్భాటంగా గురుకులాలు ప్రారంభించారే తప్ప భవనాలు కట్టించడం మరిచిపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు 40 శాతం పెంచామని, ప్రతిపక్ష నాయకుల మాదిరి డ్రామాలు చేయడం తమకు తెలియదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.