” నిరుపేద విద్యార్థులంతా మట్టిలో మాణిక్యాలు – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”
శేరిలింగంపల్లి, అక్టోబర్ 17( జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులంతా ఎంతో సామర్థ్యం కలిగిన మట్టిలో మాణిక్యలేనని, అలాంటివారు చిన్న చిన్న కారణాలతో చదువుకు దూరమైతే ఆ సరస్వతీ మాత ఎవరినీ క్షమించదని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పష్టంచేశారు. ఈ మేరకు డివిజన్ పరిధి సురభి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలక్రితం తన సొంత నిధులతో 50 లక్షలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం జరిగిందని, ఇక్కడ చదువుకునే విద్యార్థులంతా నిరుపేద వర్గాలకు చెందిన వారేనన్నారు. అలాంటి వారికి ప్రభుత్వ విద్యను పరోక్షంగా అందిస్తుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ఈ పాఠశాల పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తిన తాను ముందు ఉంటాను అనే విషయాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. నిరుపేద వర్గాలలో సైతం ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉంటారని, వారంతా మట్టిలో మాణిక్యాలేనని ఆయన కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా చిన్న చిన్న సమస్యలతో పిల్లలు ఎవరు చదువుకు దూరం కాకూడదని, పాఠశాలలో ఏ ఇబ్బంది వచ్చినా సమాచారం తనకు అందిస్తే తక్షణ కర్తవ్యానికి నిజాయితీగా కృషి చేస్తానన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులంతా సత్ప్రవర్తనతో జీవితంలో కష్టపడి ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకోవాలని… అదే వారు తనకిచ్చే విలువైన బహుమతి అని రాగం స్పష్టం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల విషయంలో కార్పొరేటర్ గానే కాకుండా, సాటి మనిషిగా ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని… విద్యార్థులకు బోధన విషయంలో ఎలాంటి లోటుపాటలు లేకుండా ఉపాధ్యాయులు ముందుకు సాగితే బాగుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన స్కూల్ యూనిఫార్మ్ ను తన చేతుల మీదుగా రాగం విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవరాజు లింగాయత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.