‘నిర్భయ’ దోషి ఆత్మహత్యాయత్నం

vinay-sharma- దిల్లీ: నిర్భయ కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ వినయ్‌శర్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తిహార్‌ కారాగారంలో ఉన్న వినయ్‌.. బుధవారం రాత్రి మాత్రలు మింగి, అనంతరం టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని గమనించిన జైలు సిబ్బంది హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశరాజధానిలో 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వినయ్‌ సహా ఆరుగురు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒకరు జువైనల్‌. మైనర్‌ మినహా వీరంతా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా.. తోటి ఖైదీలు తనపై దాడి చేశారంటూ వినయ్‌ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు అదనపు సెక్యూరిటీ కావాలని కోరాడు నిర్భయ కేసులో మరో దోషి రామ్‌సింగ్‌ కూడా 2013లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రామ్‌సింగ్‌ బంధువులు మాత్రం అతడిది హత్యేనని ఆరోపిస్తున్నారు.