నిర్మల్ సోఫినగర్‌లో పోలీసుల కార్డన్ సర్చ్
అపరిచితులు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచన
నిర్మల్,సెప్టెంబర్25 (జనం సాక్షి) : జిల్లా కేంద్రంలోని సోఫినగర్ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్ నేతృత్వంలో బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మనకు తెలియకుండానే చుట్టుపక్కల సంఘ విద్రోహులు ఉండడంతో పాటు సంచరించే అవకాశాలుంటాయన్నారు. వారి ఆట కట్టించే క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఎవరైనా తమ ఇండ్లను అª`దదెకు ఇచ్చే ముందు ఆధార్, ఓటర్‌కార్డు గుర్తింపు పరిశీలించాలని చెప్పారు. కొత్త వ్యక్తుల ద్వారా వాహనాలు కొనడం, అమ్మడం సమస్యలు కొని తెచ్చుకోవ డమేనన్నారు. మంత్రాల పేరిట వచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన మోసాలను ఈ సందర్భంగా డీఎస్పీ గుర్తు చేశారు. ప్రజలంతా స్నేహభావంతో, ప్రశాంత వాతావరణంలో ఉండాలని, పోలీసులకు ప్రజలందించే సహకారంతో సంఘ వ్యతిరేకశక్తులను మరింత సమర్థవంతంగా అణచి వేయగలమని స్పష్టం చెప్పారు. ఈ సందర్భంగా తనిఖీల్లో 87 మోటార్ సైకిళ్లు, మూడు కార్లు, ఏడు ఆటోలను సీజ్ చేశారు. పట్టణ, సోన్ సీఐలు శ్రీనివాస్, రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐలు, సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది సోఫినగర్‌లో పలువురు వ్యక్తుల గుర్తింపు పత్రాలు, వాహనాలను తనిఖీ చేశారు.