నిలువ నీడకోసం సీపీఎం ఆందోళన
రాఘవులు సహా పలువురి అరెస్ట్
హైదరాబాద్‌్, జూన్ 5 (జనంసాక్షి) :
రాష్ట్రంలో భూములు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దాదాపుగా అన్ని జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నాయకత్వంలో అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ భారీ ఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాఘువులు మాట్లాడుతూ, పేదలకు అరవై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనీసం స్పందించని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాల భూములను ఎలా కట్టబెడుతుందని ప్రశ్నించారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన భూములను వెంటనే వెనక్కు తీసుకోవాలని రాఘువులు కోరారు. ప్రభుత్వ స్పందించకపోతే భూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారో మంత్రి రఘువీరారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను మంత్రివర్గంలో పెట్టకొని సీఎం కిరణ్ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. లోతట్టు ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో లక్ష్యాలు నెరవేరడం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి భూములన్నింటినీ వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రంలో వున్న ఇల్లు లేని నిరుపేదలకు గృహ వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోపలకి వెళ్లేందుకు చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.