నీచరాజకీయాలు

1
– చోటారాజన్‌ ముస్లిం అయ్యుంటే ఇంకేం కథనాలు చెప్పేవారో?

– కాంగ్రెస్‌ నేత షకీిల్‌ అహ్మద్‌

న్యూఢిల్లీ నవంబర్‌18(జనంసాక్షి):

ఇటీవల పట్టుబడ్డ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌, ఉగ్రవాద సంస్థ ఉల్ఫా నేత అనూప్‌ చెటియా విషయమై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌ అహ్మద్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘ఛోటా రాజన్‌, అనూప్‌ చెటియా (ఉల్ఫా) ముస్లింలు కానందుకు కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లు ముస్లింలు అయి ఉంటే మోదీ ప్రభుత్వం పూర్తి భిన్నమైన కథనాన్ని చెప్పి ఉండేది’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. సీనియర్‌ నాయకుడు అయినప్పటికీ అహ్మద్‌ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని, అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం నేరస్తులను కూడా హిందు, ముస్లింల పేరిట ఆయన విడదీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మండిపడ్డారు. బీజేపీ నేతలు విమర్శలతో ట్వీట్లు వివాదాస్పదమైన నేపథ్యంలో షకీల్‌ అహ్మద్‌ వివరణ ఇచ్చారు. ఉగ్రవాదంపై మోదీ, బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. వాళ్లు ముస్లింలు అయి ఉంటే ఆ కారణంతోనే గత యూపీఏ ప్రభుత్వం వారిని అరెస్టు చేయలేదని, వాళ్లు ముస్లింలన్న కారణంతో ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని బీజేపీ నేతలు విమర్శించేవారని ఆయన తెలిపారు.