నీటిప్రాజెక్టులకు తగ్గిన వరద

ప్రాజెక్టులకు జలకళ..పర్యాటక శోభ
హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఇటీవలి వర్షాలకు ఆయా జిల్లాల్లో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించు కోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సెలవులు కూడా కావడంతో ఇక్కడికి వస్తున్నారు. వీరి రాకను గమనించి ప్రాజెక్టుల వద్ద పోలీస్‌ బందోబస్తు పెంచారు. ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కడెం జలాశయం పర్యాటక శోభ సంతరించుకుంది. నిండుకుండలా కళకళలాడుతున్న జలాశయం సందర్శకులను ఆకట్టు కుంటోంది. నిర్మల్‌-మంచిర్యాల రహదారిపైనుంచి వెళ్లే వారిని సైతం వరద గేట్ల నుంచి జాలువారు తున్న నీరు కనువిందు చేస్తోంది. కడెం అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. పర్యటకశాఖ వారు బోటింగు ఏర్పాటు కారణంగా పర్యటకులను పడవల్లో విహరింపజేశారు. ఇకపోతే కుంటాల తదితర జలపాతాలకుకూడా ప్రజల రాక పెరిగింది. మంచిర్యాల మండలం గుడిపేట సవిూపంలోని శ్రీపాదసాగర్‌ (ఎల్లంపల్లి) జలాశయంలోకి వరద నీటి ఉద్ధృతి కొంత పెరిగింది. జలాశయంలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పర్యాటకులు వస్తున్నారు. పూర్వపు వరంగల్‌ జిల్లా  ఏటూరునాగారం పరిధిలోని అభయారణ్యం ప్రపంచవాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తోంది. రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, మేడారం వనదేవతల జాతర, దామెరవాయి రాకాసి గుహలు, బొగత జలపాతం, తాడ్వాయి వన కుటీరాలు, మల్లూరు లక్ష్మినర్సింహస్వామి దేవాలయం పర్యటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని అడవులను సంరంక్షించినట్లయితే వాటితో పాటు వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరుగుతుందని అంటున్నారు.అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీశాఖ అధికారులు  చెప్పారు. వన్యప్రాణులను అక్రమంగా ఎవరు కూడా వేటావద్దని, వాటిని రక్షించుకుంటేనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని వివరించారు. ప్రతి వ్యక్తి పుట్టినరోజున ఒక మొక్కను నాటడం అలవాటుగా చేసుకోవాలని, ఆటవిడుపుగా నెలకోసారయినా అడవుల్లో పర్యటించాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు.  అక్కడక్కడా జోరుగా వర్షాలు కురుస్తున్నా ప్రధాన జలాశయాలకు నీరిచ్చే ప్రాంతాల్లో వరదలు లేకపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. ఇందులో శ్రీశైలం, జూరాల, శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంతగా వర్షాలు పడ్డా ఇవి నేటికీ నిండకపోవడం గమనార్హం. ఎగువన కర్నాకట నుంచి వరదనీరు రాకపోవడంతో శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం తగ్గింది. జూరాల ప్రాజెక్టు గేట్లను మూసి వేయడంతో శ్రీశైలంనకు వచ్చే ఇన్‌ఫ్లో ఆగిపోయింది. అలాగే కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి ఎలాంటి విద్యుదుత్పత్తి చేయడంలేదు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో 150మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు ,హంద్రీనీవాకు, కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ గేట్లను పూర్తిగా మూసివేసారు. నెట్టంపాడు , కోయిల్‌ సాగర్‌ లిఫ్ట్‌కు  నీటిని వదులుతున్నారు.  ఇకపోతే నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి నీటి రాక లేకపోవడంతో అంతగా వరదనీరు చేరలేదు.  కాలువలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. కాకతీయ కాలువకు, లక్ష్మి కాలువకు, వరద కాలువకు  గుత్ప,అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం,సాగర్‌లకు పర్యాటకులు పెరుగుతున్నారు.