‘నీట్‌’ నిర్వహణ తీరుపై జోక్యం చేసుకోలేం


` పిటిషన్‌ విచారణకు ఢల్లీి హైకోర్టు నిరాకరణ
న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ తరహాలో నీట్‌ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏడాదిలో రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహించాలా? వద్దా? అనేది అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన నిర్ణయమని.. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ తుషార్‌ రావు గేదెలతో కూడిన ధర్మానసం స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గి గ్రేడ్‌లు మెరుగుపరుచుకొనేందుకు అవకాశం కలుగుతోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. కానీ, నీట్‌ (యూజీ) అభ్యర్థులకు మాత్రం కేవలం ఒకే ఛాన్స్‌ ఉందని.. వారికీ ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కొన్ని ఇతర పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు బహళ అవకాశాల్లేవని పేర్కొన్న ధర్మాసనం.. నీట్‌పై దరఖాస్తు లేదా వినతిపత్రం ఇస్తే అధికారులు పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.