‘నీలం’ మిగిల్చిన క’న్నీరు’
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
వేలాది ఎకరాల పంటనష్టం
జలదిగ్భంధంలో వందలాది గ్రామాలు
రైలు పట్టాలపై వరదనీరు పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, నవంబర్ 3 (ఆర్‌ఎన్‌ఏ): ‘నీలం’ నిండా ముంచింది.. తుపాను ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది.. పలు జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగింది. నీలం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి పంటపొలాలను ముంచెత్తాయి. కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తుపాను ప్రభావంతో రాష్టాన్న్రి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 55 గేట్ల ద్వారా 35,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని రాళ్లవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో నలుగురు గల్లంతయ్యారు. వాగు దాటేందుకు యత్నిస్తున్న సమయంలో వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అశ్వరావుపేటలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 10,688 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కావడిగుండ్ల, వాగ్గడ్డుగూడెం, అనంతారం సవిూపంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడం మండలం అలిశెట్టిపల్లిలో రెండు చెరువులకు గండ్లు పడి 900 ఎకరాల్లో పత్తి, వరిపంట నీట మునిగింది. వరద ఉద్ధృతికి సత్తుపల్లి గని వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. తుపాను కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఓపెన్ కాస్ట్‌ల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు 20 వేల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో పత్తిపంటకు నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా అతులాకుతలమైంది. తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయానికి 17 వేల ఇన్‌ఫ్లో వస్తుండగా.. గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిని కిందకు వదలడంతో ఏలూరుకు వరదముప్పు నెలకొంది. ముందుజాగ్రత్తగా తమ్మిలేరు జలాశయం పరిసరాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దెందులూరు మండలంలోని గుండేరు డ్రేన్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ద్వారకతిరుమల-దెందులూరు రహదారిపై వరదనీరు పోటెత్తింది. కడియంలోని నర్సరీల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. కడియపులంక పూల మార్కెట్‌లో అమ్మకాలు నిలిచిపోయాయి. అటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట, నందిగామ, మైలావరం, తిరువూరు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పత్తిపంట నీట మునిగింది. బుడమేరుకు వరద పోటెత్తి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. జి.కొండూరులోని వెలగలేరు రెగ్యులేటర్ వద్ద బడుమేరు 10 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో 11 షట్టర్లు పైకి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చాట్రాయి చనుబండ వద్ద రేగటి వాగు ఉద్ధృతి కారణంగా విస్సన్నపేట-సత్తుపల్లి మధ్య రాకపోకలు నిలిచాయి. విశాఖ జిల్లానూ వర్షాలు వీడడం లేదు. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటపోలాలు నీట మునిగాయి. భీమిలి పోర్టు కుప్పకూలింది. రైవాడ జలాశయంలో నీటిమట్టం 112 అడుగులకు చేరింది. రైవాడ ఎడమ కాలువకు గండి పడడంతో వేలాది ఎకరాల్లో పంట పోలాలు నీట మునిగాయి. విశాఖ నగరానికి తాగునీటిని సరఫరా చేసే నేహాద్రిగడ్డ రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో రెండు గేట్లను ఎత్తి 362 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నల్లవాగుకు వరద పోటెత్తడంతో కొత్తపట్నం మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లకమ్మ ప్రవాహంతో ఒంగోలు-చీరాల ప్రధాన రహదారి జలమయమైంది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలో ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులన్నీ నిండాయి. కుల్లుకోనేరుకు గండిపడి విశాఖ-అరకు రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో 15 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. బాపట్లలో 25 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. నల్లమడ వాగు, పేరలీడ్రైన్, మురుకొండపాడు, ఉత్తర డ్రైన్, అప్పికట్ల కాలువల కట్టలకు గండ్లు పడి పంటపొలాలను ముంచెత్తాయి.
పలు రైళ్లు రద్దు, మరికొన్ని మళ్లింపు
పలు జిల్లాల్లో వరద నీటి ఉద్ధృతి కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ప్రయాణికుల కోసం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొండపల్లి-మధిర రైల్వేస్టేషన్ల మధ్య వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-డోర్నకల్-కాజీపేట ప్యాసింజర్, విజయవాడ-కాజీపేట-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్డు-విజయవాడ, విజయవాడ-గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. అలాగే, పాట్నా-బెంగళూరు మధ్య ప్రయాణించే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, ద్రోణచలం విూదుగా మళ్లించారు. తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతీ ఎక్స్‌ప్రెస్‌ను తెనాలి, నడికుడి, బీబీనగర్ విూదుగా, గూడూరు-సికింద్రబాద్ ఎక్స్‌ప్రెస్ తెనాలి, నడికుడి విూదుగా, చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి, నడికుడి విూదుగా మళ్లిస్తున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ (040-27700868, 97013 71060), కాజీపేట (0870 2576430, 2548660), ఖమ్మం (0874 2256025, 97013 71802), వరంగల్ (0870 242632), విజయవాడ (1072, 0866 2576796), తెనాలి (08644 227600); నెల్లూరు (0861 2345863, 2345864), రాజమండ్రి (0883 2420541, 2420543)లలో కంట్రోలు రూం ఏర్పాటు చేసింది.