నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల అస్వస్థత


నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలు
వివిధ ఆస్పత్రుల్లో విద్యార్థులకు చికిత్స
ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్‌
క్యాంపస్‌ను సందర్శించిన మంత్రి పార్థసారథి
ఏలూరు,ఆగస్ట్‌29 (జనంసాక్షి) : అపరిశుభ్ర వాతావరణం.. నాసిరకం ఆహారం వికటించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో గత వారం నుంచి వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు. విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్నా యాజమాన్యం విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడిరది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈనెల 23 నుంచి ఈ రెండు ట్రిపుల్‌ ఐటీలకు చెందిన
విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మొదలైంది. ప్రధానంగా మూడు మెస్‌లలో ఆహారం తిన్న విద్యార్థుల్లో చాలామంది అనారోగ్యం పాలయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం మొదటి షిప్ట్‌లోనే 131 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు. వెయ్యిమందికి పైగా అనారోగ్యం పాలైతే 400 మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువమంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు. అధికారులు మెస్‌లు పరిశీలించి ఇక్కడ లోపం ఉందనే విషయంపై ఆరా తీసిన పాపాన పోలేదు. మెస్‌లోని వంటశాలల్లో పరిశుభ్రతకు నిర్వాహకులు నీళ్లొదిలారు. వంట పాత్రలు, విద్యార్థులు తినే కంచాలను సరిగా శుభ్రం చేయడం లేదు. గైర్రడర్లు కడగకుండానే వినియోగిస్తున్నారు. వంటశాలలు కనీసం ఊడ్చే పరిస్థితి లేదు. ఆహార పదార్థాల నాణ్యతను ఏళ్ల నుంచి పట్టించుకోవటం లేదు. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు విద్యార్థులకు వడ్డిస్తున్నారు. చపాతీల్లో మైదా పిండి కలపడంతోపాటు పూర్తిగా కాల్చకుండానే పిల్లలకు పెడుతున్నారు. నీళ్ల సాంబారు సంగతి చెప్పనక్కరలేదు. ఈ విషయం తెలిసిన మంత్రి లోకేశ్‌ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అంటూ ఎక్స్‌లో తెలిపారు. దీంతో అధికారులు స్పందించారు. డీఎంహెచ్‌వో షర్మిష్ఠ ట్రిపుల్‌ ఐటీ మెస్‌లు, ఆసుపత్రిని సందర్శించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఉన్న ఫుడ్‌కోర్టును పరిశీలించారు. నిల్వ మాంసం, బూజు పట్టిన ఆహార పదార్థాలు గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ’విూ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా’ అంటూ మండిపడ్డారు. ఘటనపై విచారణ చేసి నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీనిపై ఆయన రిజిస్టార్ర్‌తో మాట్లాడి అనారోగ్యానికి కారణాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్యంపై నిరంతరం పర్యవేక్షించాలని ఏలూరు జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు.